Young india students kit - విద్యా వికాసమే ప్రభుత్వ లక్ష్యం - సీఎం రేవంత్ రెడ్డి - bikki news

Young India Students kit – విద్యా వికాసమే ప్రభుత్వ లక్ష్యం – సీఎం రేవంత్ రెడ్డి

BIKKI NEWS (JUNE 19) : Young India students kit programme in Telangana. విద్యార్థినీ విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి వారిని సమాజంలో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా, స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని పేర్కొన్నారు.

Young India students kit programme in Telangana

“విద్యార్థులు బాగా బాగా చదువుకోవాలి. చదువుకోవడానికి ఏం కావాలో సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటా. పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ కాకుండా భవిష్యత్తులో రవాణా సౌకర్యం కల్పించాలని ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రంలో 27.50 లక్షల మంది విద్యార్థులకు యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్స్ అందిస్తున్నాం. తెలంగాణను ఒక ఎడ్యుకేషన్ హబ్‌గా, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం” అని ముఖ్యమంత్రి గారు అన్నారు

విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు కిట్స్ పంపిణీతో పాటు విద్యా రంగానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

ఇదే సందర్భంగా మాదక ద్రవ్యాల నియంత్రణపై చైతన్యం కలిగించడానికి స్కూల్, కాలేజీ విద్యార్థులందరితో ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు గవర్నర్ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, సలహాదారు కె. కేశవరావు గారితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, వేలాదిగా తరలివచ్చిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఆత్మగౌరవంతో చదువుకోవడానికి వీలుగా అన్ని రకాల వస్తువులతో కిట్స్ అందజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థులను ఆశీర్వదించిన గవర్నర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు” అని అన్నారు.

“విద్యా రంగాన్ని వికాసంవైపు నడిపించాలన్న లక్ష్యంతో బడ్జెట్‌లో ఆ రంగానికి రూ. 26,600 కోట్లు (8.5 శాతం) నిధులు కేటాయించాం. దీన్ని ప్రభుత్వం ఖర్చుగా కాకుండా భవిష్యత్తుకు పెట్టుబడిగా భావిస్తోంది. రేపటి భవిష్యత్తుకు బలమైన ఆర్థిక పునాదులు వేయాలి. దేశ భవిష్యత్తు సంక్షేమ హాస్టళ్లలో ఉంది” అని పేర్కొన్నారు.

“గ్రామీణ ప్రాంతాలు, తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని భావిస్తున్నాం. ప్రతి పేదవాడి గుండెను తట్టాలని విద్యా శాఖను నిరంతరం పర్యవేస్తున్నా. అత్యంత నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంగ్లీషులో చదువుకోవాలని, భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. వారి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ప్రారంభించాం” అని ముఖ్యమంత్రి గారు సభలో వివరించారు.

వారి కలలను సాకారం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఎవరేమనుకున్నా నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు ఒక స్పష్టమైన విధానం ఉండాలని విద్యా పాలసీని తెచ్చామని గుర్తుచేశారు.

“ఆరుట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ మోడల్ స్కూల్ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ అని బోర్డు పెట్టే పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఉపాధ్యాయులు ఎంతో శ్రమించి పనిచేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్ అందిస్తున్నాం” అని చెప్పారు

“విద్యా రంగంలో తెలంగాణను దేశానికి రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతాం. తెలంగాణ ఒక యునికార్న్‌గా ఎదగాలి. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలి. దేశంలో గొప్ప నాయకులుగా ఎదగాలి. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు గొప్పగా రాణించాలి. ఈ దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి” అని ముఖ్యమంత్రి గారు విద్యార్థులను కోరారు.

“డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు దేశానికి దిక్సూచిగా నిలిచారు. తెలంగాణలోని దళిత బిడ్డల నుంచి వంద మంది అంబేద్కర్లు రావాలి. అందరి తలరాతను మార్చేది తరగతి గది మాత్రమే. బాగా చదువుకోవాలి. చదువుకోవడానికి ఏం కావాలో సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటా” అని విద్యార్థులకు భరోసానిచ్చారు.

రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఆయా పాఠశాలల విద్యార్థులకు కిట్స్‌ను అందించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. చదువులో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాన్ని, ప్రశంసా పత్రాలను అందజేశారు. గవర్నర్ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు “అన్న- అక్క మెంటార్షిప్” కార్యక్రమాన్ని ఆవిష్కరించారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →