Tg cabinet decisions may 4th 2026 - కేబినెట్ నిర్ణయాలు - bikki news

TG CABINET DECISIONS MAY 4th 2026 – కేబినెట్ నిర్ణయాలు

BIKKI NEWS (MAY 05) : TG CABINET DECISIONS MAY 4th 2026. తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం మే 04న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భేటీ అయి ముఖ్య నిర్ణయాలు తీసుకుంది.

TG CABINET DECISIONS MAY 4th 2026

గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులలో అవినీతి ఆరోపణలపై జస్టిస్ మదన్ బి. లోకూర్ గారి నేతృత్వంలోని కమిషన్ నివేదికపై తదుపరి దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగించడానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల గురించి ఏం చర్చ జరగలేదని. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడారని వారి డిమాండ్లకు ముఖ్యమంత్రి గారు ఓకే అన్నారని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు

విద్యుత్తు కొనుగోళ్లతో పాటు భద్రాద్రి, యాదాద్రి విద్యుత్తు ప్లాంట్లలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ లోకూర్ గారి నేతృత్వంలోని కమిషన్‌ అందజేసిన 114 పేజీల నివేదికపై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సూచనలు, అభిప్రాయాలపై మంత్రిమండలి చర్చించింది.

ఇందులో అంతర్రాష్ట్ర అంశాలు ఇమిడి ఉండటం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో ముడిపడి ఉన్నందున దీనిపై సమగ్రమైన, నిష్పాక్షిక దర్యాప్తు కోసం ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు అప్పగించాలని మంత్రిమండలి తీర్మానించింది.

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.

రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో వివిధ జిల్లాల్లో పంటలు, పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లిన సమాచారంపై మంత్రివర్గం చర్చించింది. ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు బాధ్యత తీసుకుని వివరాలు తెప్పించుకుని, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.

రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మార్కెట్ విలువల రేషనలైజేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈనెల చివరి వారంలో సవరించిన విలువలు అమల్లోకి వచ్చేలా నిర్ణయించింది.

వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే పరిహారం రేట్లపై అసంతృప్తితో ఉండటమే కాకుండా, ధరలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలించింది. దాంతో పాటు మార్కెట్ ధరలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో శాస్త్రీయ పద్ధతిలో ధరలను సవరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ⁠

భూముల ధరలు పెరిగేలోపు హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం భావించింది. దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పుడున్న ధరల మేరకు ముందుగా 10 శాతం చెల్లించే వెసులుబాటు కల్పించి, మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించే విధంగా నిర్ణయించింది.

రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు (అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్లు), పాలిటెక్నిక్ కాలేజీలు, టీ శాట్‌ను ఇకనుంచి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చి ఒకే గొడుగు నిర్వహించాలని నిర్ణయించింది.

నల్గొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు అప్పగించే ఎంఓయూకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో నల్గొండ – రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ (NARMAC) కు సంబంధించిన పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి డైరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఎన్‌డీబీ నిర్వహిస్తుంది.

తెలంగాణలో 9 ఉమ్మడి జిల్లాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్ల సమీపంలో సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. పైలెట్ ప్రాజెక్టుగా 18 చోట్ల ఈ సోలార్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది.

క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పెండింగ్‌లో ఉన్న పన్నులను క్లియర్ చేసుకోవడానికి వీలుగా వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో ఆధునిక కూరగాయల మార్కెట్ కోసం 42 ఎకరాల భూమి కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →