STIPEND : ఆ విద్యార్థులకు నెలకు 2 వేలు – సీఎం రేవంత్ రెడ్డి

Stipend : ఆ విద్యార్థులకు నెలకు 2 వేలు - సీఎం రేవంత్ రెడ్డి - bikki news

BIKKI NEWS (SEP. 27) : monthly 2000 rupees stipend for Telangana students. తెలంగాణలోని యువతీ యువకులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలు కల్పిస్తుందని, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. నైపుణ్యత కలిగిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు విదేశాల్లో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవడానికి సహాయకారిగా ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

monthly 2000 rupees stipend for Telangana students.

“ఏటీసీల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రతి నెలా 2000 రూపాయల స్టయిఫండ్ ఇస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ స్టయిఫండ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇది ఖర్చు కాదు. భవిష్యత్తుకు పెట్టుబడి. పని చేయాలన్న సంకల్పం కావాలి. కష్టపడి పనిచేయాలి. మీకు ఉద్యోగావకాశాలు, పాస్‌పోర్టు తదితర సర్వీసును అందించడానికి ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. మీ భవిష్యత్తుకు పునాదులు వేస్తాం.

రాష్ట్రంలోని ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) మార్చిన నేపథ్యంలో మల్లేపల్లి ఐటీఐ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలను విర్చువల్‌గా ప్రారంభించారు.

అనంతరం అక్కడ జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, నైపుణ్యం పెంచుకోవడానికి ప్రభుత్వం అన్ని అవకాశాలను కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.

ఏటీసీల్లో శిక్షణ పొందిన తమ్ముళ్లు, చెల్లెళ్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడంలో మీ వంతు కృషి చేయాలి. అభివృద్ధిని సాధించాలన్న సంకల్పంతోనే యువతలో సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

రాష్ట్రంలో 1956 లో ప్రారంభమైన ఐటీఐలు, క్రమేణా 65 ఐటీఐలకు పెరిగినప్పటికీ గత ప్రభుత్వాలు వీటిని పట్టించుకోలేదు. మారిన కాలానికి ఈ కేంద్రాలు ఏమాత్రం సంబంధం లేకుండా పాతకాలపు ఒరవడిలో నడిచాయి.

వాటిని సమూలంగా మార్చి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యం కలిగిన శిక్షణ అందించాలన్న లక్ష్యంతో గత ఏడాది ఇదే ప్రాంగణంలో ఏటీసీలకు పునాదులు వేసుకున్నాం.

టాటా టెక్నాలజీస్ సహకారంతో రాష్ట్రంలో 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చడానికి ప్రభుత్వం కేవలం 300 కోట్లు ఖర్చు చేస్తే టాటా సంస్థ 2100 కోట్లు ఖర్చు చేసి ఆధునిక ఏటీసీలను తీర్చిదిద్దారు. మన వద్ద డబ్బుకన్నా ఆలోచన, చిత్తశుద్ది ఉండాలి. చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు.

ప్రస్తుతం 65 ఏటీసీలకు అదనంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మరో 51 ఏటీసీలను ప్రారంభిస్తాం. ఈ 116 ఏటీసీలు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాయి. ఒకప్పుడు ఐటీఐల్లో చదువుకున్న వారికి ఆర్టీసీలో అప్రెంటిస్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అప్రెంటిషిప్ ఇప్పించే ఏర్పాట్లు చేయాలి.

రాష్ట్రంలో ప్రతి ఏటా 1 లక్షా 10 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టా పొందుతున్నప్పటికీ నైపుణ్యం లేని కారణంగా చాలా మందికి ఉద్యోగావకాశాలు రావడం లేదు. నైపుణ్యం లేనిదే ప్రైవేటు కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే స్కిల్స్ పెంచాలన్న అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి ప్రారంభించామంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్నదే మా సంకల్పం.

చేతుల్లో డిగ్రీలు ఉన్నా స్కిల్స్ లేకపోతే ప్రయోజనం లేదు. నైపుణ్యత కలిగిన వారికి దక్షిణ కొరియా, జర్మనీ, జపాన్, రష్యా లాంటి దేశాల్లో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయి. కేవలం ఐటీ చదివితేనే ఉద్యోగాలొస్తాయన్న అపోహల్లో బతుకుతున్నాం. అది తప్పు. ఏటీసీల్లో చదువుతున్న యువత నైపుణ్యత సాధించడంపై ఫోకస్ పెట్టాలి.

చదువు ఒక్కటే సమాజంలో అసమానతలు రూపుమాపుతుంది. మీకు గౌరవం దక్కుతుంది. చదువు, సాంకేతిక నైపుణ్యం ఒక్కటే మీ తలరాతను మార్చుతుంది. ఈ ప్రభుత్వం మీకు అవకాశాలు, వసతులను ఏర్పాటు చేస్తుంది. చదువుకుని రాణించండి. చదువు లేకపోతే, నైపుణ్యం లేకపోతే ఎందుకూ కొరకాకుండా పోతారు.. అని ఉద్బోధించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారితో పాటు ఉన్నతాధికారులు, టాటా టెక్నాలజీస్ (Tata Technologies) ప్రతినిధులు, ఏటీసీ విద్యార్థులు హాజరయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఏటీసీల నుంచి స్థానికంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని వినిపించారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →