Minority government degree colleges - జిల్లా కేంద్రాల్లో మైనారిటీ డిగ్రీ కళాశాలలు - bikki news

Minority Government degree colleges – జిల్లా కేంద్రాల్లో మైనారిటీ డిగ్రీ కళాశాలలు

BIKKI NEWS (MAY 09)!: minority government degree Colleges in Telangana. మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మ‌డి జిల్లా కేంద్రాల్లో ప్ర‌త్యేక డిగ్రీ క‌ళాశాల‌లు ఏర్పాటు చేసి, వాటిలో నైపుణాభివృద్ధి, ఏఐ శిక్ష‌ణ‌కు ప్రాధాన్య‌మివ్వాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. సంప్ర‌దాయ కోర్సులకు పరిమితం కాకుండా వారి జీవ‌నోపాధికి ఉప‌యోగ‌ప‌డే శిక్ష‌ణ ఇవ్వాలని సూచించారు.

minority government degree Colleges in Telangana

ముఖ్యమంత్రి గారు మైనారిటీ సంక్షేమ శాఖ‌పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌తిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు ఇస్తున్న‌ట్లే మైనారిటీ విద్యార్థుల‌కు ప్రోత్సాహాకాలు అందించాల‌ని, అందుకోసం ప్రత్యేకంగా ఒక కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సూచించారు.

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 కి ఎంపికైన మైనారిటీ అభ్య‌ర్థుల్లో ఆస‌క్తి ఉన్న వారిని ఎంపిక చేసి మైనారిటీ సంక్షేమ శాఖ‌లో బాధ్య‌త‌లు అప్ప‌గించి, ఆ శాఖ ప‌రిధిలో చేప‌ట్టే అన్ని కార్య‌క్ర‌మాల‌పై పూర్తి అవ‌గాహ‌న క‌లిగేలా వారిని తీర్చిదిద్దాల‌ని ఆదేశించారు.

విద్యార్థుల‌కు ప్రోత్సాహాకాలు అందించే కార్య‌క్ర‌మానికి గ్రూప్స్‌కు ఎంపికైన వారిని, క్రీడాకారుల‌ను ఆహ్వానించి విద్యా, క్రీడ‌ల ప్రాధాన్య‌త‌ను వారికి తెలియ‌జేయాల‌ని సూచించారు. ఇమామ్‌, మౌజ‌మ్‌ల‌కు ఇచ్చే గౌర‌వ పారితోషికాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా విడుద‌ల చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

భూ ల‌భ్య‌త ఉన్న చోట ఖ‌బ‌ర‌స్తాన్‌ల‌కు స్థ‌లాలను కేటాయిస్తామ‌ని ముఖ్యమంత్రి గారు తెలిపారు. డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఇంజిన్ల‌తో రీట్రోఫిట్టింగ్ చేయడం ద్వారా ఆటోడ్రైవర్లకు ఇంధన ఖర్చులు లేకుండా చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఒక ప్రణాళిక రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి గారు తెలిపారు.

మూసీ రివ‌ర్ ఫ్రంట్‌ ప్రాజెక్టులో భాగంగా గుడితో పాటు మసీద్, చర్చి, గురుద్వారా నిర్మాణాలు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆయా మతాలకు సంబంధించిన సంస్కృతుల అధ్యయనం, భారత దేశ విశిష్టతను, తెలంగాణలోని గంగా జమునా తెహ్‌జీబ్ ను తెలియ‌జేసేలా ఆ కట్టడాలు ఉండాల‌ని అన్నారు. మన సంస్కృతులను అధ్యయనం చేసే గొప్ప అధ్య‌య‌న కేంద్రాలుగా అవి పరిఢ‌విల్లాలని ఆకాంక్షించారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ గారు, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు) మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, TGMREIS అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషీ గారితో పాటు వివిధ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →