Bhatti - employees meeting - ఉద్యోగ సంఘాల‌తో భట్టి బేటీ పూర్తి వివరాలు - bikki news

Bhatti – Employees Meeting – ఉద్యోగ సంఘాల‌తో భట్టి బేటీ పూర్తి వివరాలు

  • 45 స‌మ‌స్య‌లను డిప్యూటీ సీఎం దృష్టికి..
    తీసుకెళ్లిన టీజీఈ జేఏసీ ప్ర‌తినిధులు
  • స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, ఆర్థిక‌భారంపై…ఉద్యోగ సంఘాల‌తో సుదీర్ఘ చ‌ర్చ‌
  • సానుకూలంగా స్పందించిన భట్టి విక్ర‌మార్క‌. సీఎంతో చ‌ర్చించి 100 రోజుల్లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ
  • ప్ర‌తినెల రూ.వెయ్యి కోట్లు కేటాయించేందుకు చ‌ర్య‌లు
  • ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ వాయిదా వేసుకోవాల‌ని ఉద్యోగుల‌కు సూచ‌న‌
  • చ‌ర్చ‌ల ప‌ట్ల సంతృప్తి వ్యక్తం చేసిన టీజీఈ జేఏసీ చైర్మ‌న్ ల‌చ్చిరెడ్డి
  • మే 5 కార్య‌చ‌ర‌ణ‌పై టీజీఈ జేఏసీ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించిన త‌ర్వాతే నిర్ణ‌యం !

BIKKI NEWS (MAY 01) : Bhatti Vikramarka meeting highlights with employees unions . ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ప్ర‌భుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా శుక్ర‌వారం డిప్యూటీ సీఎం భట్టి విక్ర‌మార్క ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌తో ప్ర‌జా భ‌వ‌న్ లో బేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా సుమారు 45 స‌మ‌స్య‌ల‌ను టీజీఈ జేఏసీ చైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ వోడ్నాల రాజ‌శేఖ‌ర్, టీజీఈ జేఏసీ భాగ‌స్వామ్య ప‌క్ష ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు డిప్యూటీ సీఎం బ‌ట్టి విక్ర‌మార్క దృష్టికి తీసుకెళ్లారు.

Bhatti Vikramarka meeting highlights with employees unions

అలాగే రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంటింజెంట్ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై బ‌ట్టి విక్ర‌మార్క‌కు వివ‌రించారు. ఉద్యోగుల ప్ర‌ధాన స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, త‌ద్వారా ప్ర‌భుత్వంపై ప‌డుతున్న ఆర్థిక భారం, స‌త్వ‌రం ప‌రిష్క‌రించాల్సిన స‌మ‌స్య‌ల‌పై ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌తో బ‌ట్టి విక్ర‌మార్క‌ సుదీర్ఘంగా చ‌ర్చించారు.

ఉద్యోగుల న్యాయ‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు షురూ చేసింద‌ని, అయితే అన్ని స‌మ‌స్య‌ల‌ను ఏక‌కాలంలో కాకుండా ద‌శ‌ల వారిగా ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని బ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. పెన్ష‌న‌ర్ల స‌మ‌స్య‌ల‌ను వంద రోజుల‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని ఇప్ప‌టికే క్యాబినెట్‌లో నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింద‌ని, అలాగే ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను కూడా 100 రోజుల్లోనే ప్రాధాన్య‌త క్ర‌మంలో ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బ‌ట్టి ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌కు హామీ ఇచ్చారు.

త్వ‌ర‌లోనే సీఎంతో బ‌ట్టి బేటీ…

ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు ఇచ్చిన విన‌తులపై త్వ‌ర‌లోనే సీఎం రేవంత్ రెడ్డితో చ‌ర్చించి సానుకూల నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. సాద్య‌మైనంత త్వ‌ర‌గా పీఆర్‌సీ నివేదిక‌ను తెప్పించుకొని అమ‌లు చేస్తామ‌ని, ఈ విష‌యంలో ఉద్యోగుల‌కు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు. ఉద్యోగ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో భాగంగా ఉద్యోగ సంఘాలు ప్ర‌క‌టించిన ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ‌ను విర‌మించుకోవాల‌ని, ఉద్యోగుల ప్ర‌తి స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం ప‌రిష్క‌రిస్తుంద‌ని హామీ ఇచ్చారు.

ప్ర‌భుత్వంపై ఆర్థిక భారం ప‌డినా ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌ట్ల ప్ర‌జా ప్ర‌భుత్వం సానుకూల నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని, ఇటీవ‌ల అత్యంత జ‌ఠిల‌మైన ఆర్టీసీ కార్మికుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వం సానుకూల నిర్ణ‌యం తీసుకుంద‌ని ఈ సంద‌ర్భంగా బభట్టి విక్ర‌మార్క గుర్తు చేశారు.

ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా త్వ‌ర‌లోనే సీఎంతో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై తీపి క‌బురు చెప్తాన‌ని డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్ర‌మార్క తెల‌ప‌డం ప‌ట్ల టీజీఈ జేఏసీ చైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేయ‌డంతో పాటు త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, ఉపాధ్యాయుల‌కు, పెన్ష‌న‌ర్ల‌కు, కాంటిజెంట్ ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం నుంచి తీపి క‌బురు వ‌స్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ముఖ్య‌మంత్రితో డిప్యూటీ సీఎం చ‌ర్చించి సానుకూల నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆశిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అయితే ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా 2026 మే 5వ తేదీన చేప‌ట్ట‌నున్న కార్య‌చ‌ర‌ణ‌పై టీజీఈ జేఏసీ ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులంద‌రితో చ‌ర్చించిన త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని టీజీఈ జేఏసీ చైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి స్ప‌ష్టం చేశారు.

భట్టితో బేటి అయిన వారిలో టీజీఈ జేఏసీ భాగ‌స్వామ్య ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు కె.రామకృష్ణ, ఎస్‌.రాములు, బాణాల రాం రెడ్డి, పెంట‌య్య‌, రామేష్ పాక‌, డా.నిర్మ‌ల‌, ఎండీ హ‌బీబ్ మియా, కె.మ‌హిపాల్ రెడ్డి, ద‌ర్శ‌న్ గౌడ్‌, వి,బిక్షం, ఉపెంద‌ర్ రావు, ఎన్‌.రాబ‌ర్ట్ బ్రూస్‌, డా.ఏ.సైదులు, జే.బుచ్చ‌య్య‌, కె.కుమార స్వామి, ఎస్‌కే.హ‌బీబ్ మియా, వెంక‌టేశం, వివేక్‌, మ‌మ‌త, క్రాంతి కుమార్‌, ర‌వి, న‌రేంద‌ర్‌, స్వామి, దేవిక‌, ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ల‌చ్చిరెడ్డి ఆధ్వ‌ర్యంలో టీజీఈ జేఏసీ ప్ర‌తినిధులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన 45 స‌మ‌స్య‌లు…

  1. 2026 జూన్ 2 నాటికి పీఆర్‌సీ అమలు.
  2. పెన్షనర్లు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ఏక‌కాలంలో క్లియర్ చేయాలి.
  3. ఉద్యోగుల హెల్త్ స్కీం ద్వారా తక్షణమే నగదు రహిత వైద్యం అందించాలి.
  4. సీపీఎస్‌ను రద్దు చేసి ఓల్డ్ పెన్ష‌న్ స్కీంను పునరుద్ధరించాలి.
  5. 2004 సెప్టెంబ‌ర్ 1వ తేదీకి ముందు నోటిఫికేష‌న్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి.
  6. అవుట్‌సోర్స్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాలి.
  7. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంట‌నే విడుదల చేయాలి.
  8. రెవెన్యూ శాఖలో 61 ఏళ్లు పైబడిన వీఆర్ఏల వార‌సుల ఉద్యోగ‌ నియామకం చేప‌ట్టాలి.
  9. రెవెన్యూ శాఖ నుండి తొలగించబడిన 632 మంది కంప్యూటర్ ఆపరేటర్లను, ఎఫ్‌టీఎస్‌ల సేవలను తక్షణమే పున‌రుద్ద‌రించాలి.
  10. రెవెన్యూ శాఖకు ధరణి ఆపరేటర్ల సేవల‌ను కొనసాగించాలి.
  11. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్ర‌త్యేక‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
  12. ఉద్యోగుల సాధారణ బదిలీల కోసం ఒకే స్టేషన్‌లో మూడు సంవత్సరాలు పని చేయాలనే అర్హత ప్రమాణాన్ని రెండు సంవత్సరాలకు తగ్గించాలి.
  13. జీ.ఓ.నెం.317లో, భవిష్యత్తు ఖాళీలలో అంతర్ జిల్లాల‌, జీవిత భాగస్వాముల కేసులను ప‌రిష్క‌రించాలి. సీనియారిటీ కారణంగా ఇతర జోన్‌లకు, జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులను, గతంలో పనిచేసిన జోన్‌లు/మల్టీ జోన్‌లలో భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలలో తిరిగి తీసుకోవాలి.
  14. జీ.ఓ.ఎం.ఎస్.నెం.317 పోర్టల్‌లో ఒంటరి ఉద్యోగులకు అవ‌కాశం ఇవ్వాలి.
  15. మల్టీజోన్-I నుండి మల్టీజోన్-II కి, లేదా దీనికి విరుద్ధంగా, కొంతమంది ఉద్యోగులను తిరిగి కేటాయించడానికి 317 జీ.ఓ. పోర్టల్‌లో అవ‌కాశం క‌ల్పించాలి.
  16. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ నిమిత్తం బదిలీ చేయబడి, నేటికి స్వంత జిల్లాల‌కు తిరిగి రాని తహసీల్దార్లు/నాయబ్ తహసీల్దార్లు, ఇతర అధికారులను స్వ‌స్థాల‌కు రప్పించాలి.
  17. అన్ని విభాగాలలో కేడర్ల‌ వారీగా ఖాళీలను పదోన్నతుల ద్వారా గానీ, నియామకాల ద్వారా గానీ ఎలాంటి కాలవ్యవధి లేకుండా భర్తీ చేయాలి.
  18. సీఆర్‌పీసీ సెక్షన్ -197 అనగా, ఇప్పుడు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ -218 లో నిర్దేశించిన విధంగా ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నప్పుడు విభాగాధిపతి ముందస్తు అనుమతి లేకుండా స‌ద‌రు ఉద్యోగుల‌పై ఎటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేయవద్దు.
  19. ఉద్యోగంలో ఉండగా మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు త్వరగా కారుణ్య నియామకాలు చేప‌ట్టాలి.
  20. రెవెన్యూ ఉద్యోగుల కోసం రెవెన్యూ శిక్షణా అకాడమీని స్థాపించాలి.
  21. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న దివ్యాంగులకు పదోన్నతులలో 4% రిజర్వేషన్ కల్పించాలి, నిబంధనల ప్రకారం దివ్యాంగత్వ ప్రమాణాల శాతాన్ని కూడా 70% నుండి 40%కి తగ్గించాలి.
  22. దివ్యాంగ‌ ఉద్యోగుల బదిలీల విషయంలో వారి వైకల్య శాతాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యత ఇవ్వాలి.
  23. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలి.
  24. వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ బిల్లులపై గరిష్ట పరిమితిని పెంచాలి. అలాగే పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరగా క్లియర్ చేయాలి.
  25. ఉద్యోగులకు మంజూరు చేయబడిన అనారోగ్య చికిత్సల కోసం ప్రస్తుతం ఉన్న రేట్లు సరిపోవు, కార్పొరేట్ ఆసుపత్రులలో అమలులో ఉన్న చికిత్స రేట్ల ప్రకారం వాటిని సవరించాలి.
  26. ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పదవి మంజూరు చేయాలి.
  27. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను పరిగణించాలి.
  28. ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారి వారి జిల్లా కేంద్రాలలో, నిర్దేశిత ప్రదేశాలలో గృహ స్థలాలను అందించాలి.
  29. రెవెన్యూ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్లు / టైపిస్టులు, హెచ్‌హెచ్‌పీలు, ఎఫ్‌టిఎస్‌లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు గ్రామ పాలన అధికారి (జీపీఓ)గా పనిచేసే అవకాశం కల్పించాలి.
  30. ఉద్యోగుల అన్ని కేడర్‌లకు పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలి.
  31. 2025 జ‌న‌వ‌రి 1వ తేదీ నాటికి బకాయి ఉన్న కరువు భత్యాలను బకాయిలతో పాటు విడుదల చేయాలి.
  32. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పే రివిజన్ కమిషన్ నివేదికను ఖరారు చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరికీ 51% ఫిట్‌మెంట్‌తో అమలు చేయడం.
  33. తెలంగాణలోని వివిధ శాఖ అధికారులకు కేటాయించిన వాహనాల అద్దె ఛార్జీల బకాయి చెల్లింపుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి.
  34. ప్రభుత్వ ఉద్యోగులకు గృహ నిర్మాణ అడ్వాన్స్, పండుగ అడ్వాన్స్ మొదలైన వాటితో సహా రుణాలు, అడ్వాన్సుల పెంచాలి.
  35. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పదవీ విరమణ రోజునే పింఛను ప్రయోజనాలను చెల్లించాలి.
  36. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు వార్షిక బడ్జెట్‌ను అందించాలి.
  37. 300 రోజుల E.L. గరిష్ట పరిమితిని 365 రోజులకు పెంచాలి.
  38. గ్రాట్యుటీ మొత్తంలో పెంపు 20 లక్షల కంటే తక్కువ ఉండకూడదు.
  39. నగర, జిల్లా ప్రధాన కార్యాలయాలలో హెచ్‌ఆర్‌ఏను 35% కంటే తక్కువ కాకుండా, డివిజన్, మండల స్థాయిలో 30% చొప్పున పెంచాలి.
  40. వాటా పింఛను పథకానికి బదులుగా పాత పింఛను పథకాన్ని అమలు చేయడం.
  41. సీపీఎస్ ఉద్యోగి మరణించిన సందర్భాలలో, మరణించిన ఉద్యోగి కుటుంబానికి కుటుంబ పింఛను మంజూరు చేసేటప్పుడు, సీపీఎస్ నిధికి తీసివేసిన మొత్తాన్ని వారి కుటంబ స‌భ్యుల‌కు తిరిగి చెల్లించాలి.
  42. రాబోయే పీఆర్సీలో ఎస్.జి.టి, పాఠశాల సహాయకుల జీతాల స్కేలు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలి.
  43. అద్దె వాహన ఛార్జీలను నెలకు రూ.33000/- నుండి రూ. 75000/-కు పెంచాలి.
  44. ఇంటర్మీడియట్ విద్యలో క్రమబద్ధీకరించబడిన కాంట్రాక్ట్ లెక్చరర్లైన జూనియర్ లెక్చరర్లకు ప్రొబేషన్ ప్రకటించాలి.
  45. 010 ఖాతా శీర్షిక ద్వారా జీతాలు, TGGLI, GIS చెల్లింపుతో పాటు గురుకుల ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డుల జారీ చేయాలి.
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →