Hyd metro - హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం - bikki news

Hyd Metro – హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

BIKKI NEWS (SEP. 25) : Telangana government takeover the Hyderabad Metro. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు, ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కంపెనీ రవాణా సంబంధిత వ్యాపారాల నుంచి వైదొలగిన నేపథ్యంలో మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగస్వామిగా ఉండలేమని ఎల్ అండ్ టీ ప్రకటించడంతో మెట్రో ఫేజ్ 1 ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని రెండో దశ విస్తరణ కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించింది.

Telangana government takeover the Hyderabad Metro.

మెట్రో రైలు విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ అంశంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు ఇతర ఉన్నతాధికారులు, ఎల్ అండ్ టీ గ్రూప్‌ సీఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్‌ గారితో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

నగరంలో మెట్రో విస్తరణ కోసం ఈక్విటీ భాగస్వామిగా ఉండాలని ఎల్ అండ్ టీ కంపెనీని సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఆహ్వానించగా, రవాణా సంబంధిత వ్యాపారం నుంచి కంపెనీ పూర్తిగా వైదొలగినందున ఈక్విటీ భాగస్వామిగా ఉండలేదని కంపెనీ సీఎండీ గారు తెలియజేశారు. ఇదే క్రమంలో మెట్రో రైలు ఫేజ్ 1 లో ఎల్ అండ్ టీ వాటా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్టు వివరించారు.

వాస్తవానికి మెట్రో నెట్ వర్క్ పొడవులో 2014లో దేశంలో హైదరాబాద్ మెట్రో రెండో స్థానంలో ఉంది. ఎలాంటి విస్తరణ జరక్కపోవడంతో ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో 9 వ స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో మెట్రో ఫేజ్ 2 A & 2 B కింద దాదాపు 163 కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది.

ఇప్పటికే ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉన్న ఫేజ్-1 మెట్రోను, విస్తరణలో భాగంగా ప్రభుత్వ ఏజెన్సీ ఆధీనంలోకి వచ్చే ఫేజ్-2తో అనుసంధానించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తింది. దీనికి ‘డెఫినిటివ్ అగ్రిమెంట్’ అవసరమని కేంద్రం స్పష్టం చేసింది.

దాంతో ఫేజ్ -2 విస్తరణలో ఈక్విటీ భాగస్వామిగా ఉండాలని ప్రభుత్వం ఎల్ అండ్ టీ ముందు ప్రతిపాదించింది. అయితే, రవాణా సంబంధిత వ్యాపారం నుంచి కంపెనీ వైదొలగిందని చెప్పడంతో మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

మెట్రో ఫేజ్ -1 ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ఎల్ అండ్ టీ కంపెనీకి మెట్రో పై ప్రస్తుతం ఉన్న దాదాపు రూ. 13,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అలాగే, కంపెనీ ఈక్విటీ విలువకు సుమారు రూ. 2,000 కోట్లు వన్‌ – టైమ్‌ చెల్లింపుగా అందించాలని ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతిపాదించింది. ఈ చెల్లింపు పూర్తి చేసిన వెంటనే మెట్రో మొదటి దశ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి వస్తుంది.

మెట్రో విస్తరణకు సంబంధించిన రాష్ట్ర ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు సమావేశాలు నిర్వహించిన కేంద్రం ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నడుస్తున్న ఫేజ్‌ 1 మెట్రోకు, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫేజ్‌ 2 విస్తరణకు సంయుక్త కార్యాచరణ అవసరమని పేర్కొంది. అందుకు వీలుగా ఒప్పందం (Definitive Agreement) కావాలని కేంద్రం స్పష్టం చేసింది. ఫేజ్‌ 2లో కూడా ఎల్ అండ్ టీ భాగస్వామ్యం ఉండాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది.

కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో నెలకొన్న ప్రతిష్ఠంభనను అధిగమించేందుకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో ఈ చర్చలు జరిపారు. “మెట్రో ఫేజ్‌ 2లోనూ ఎల్ అండ్ టీ భాగస్వామిగా ఉంటే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగినంత ప్రాధాన్యత ఇస్తాం” అని ముఖ్యమంత్రి గారు చెప్పారు.

ఫేజ్‌ 1 మరియు ఫేజ్‌ 2 కారిడార్ల మధ్య సంయుక్త కార్యాచరణకు కచ్చితమైన ఒప్పందం అవసరమని ముఖ్యమంత్రి సూచించారు. ఎల్ అండ్ టీ తో ఒప్పందం కుదిరితే విస్తరణ కార్యకలాపాలు సజావుగా సాగుతాయని, ఆదాయ వ్యయాల భాగస్వామ్యంలో స్పష్టత ఉంటుందని ముఖ్యమంత్రి గారు అన్నారు.

భాగస్వామిగా ఉండలేమని, 2002 జులై 22న కుదిరిన రాయితీ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం అంగీకరించిన రూ. 3,000 కోట్ల వడ్డీ లేని రుణంలో రూ.2100 కోట్లు బకాయి ఉందని ఎల్ అండ్ టీ ప్రతినిధులు గుర్తు చేశారు.

ఎల్ అండ్ టీ తో చర్చల మేరకు మెట్రో ఫేజ్‌ 1 ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆర్థిక ఒప్పందాలు, చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో మెట్రో రెండో దశ విస్తరణ వేగవంతమవుతుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, ఆమోదం తొందరగా వచ్చే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఎన్‌వీఎస్‌ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఎంఏయూడీ సెక్రెటరీ ఇలంబర్తి, హైదరాబాద్ మెట్రో ఎండి సర్ఫరాజ్‌ అహ్మద్‌, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం సెక్రెటరీ మాణిక్యరాజ్‌ గారితో పాటు ఎల్ అండ్ టీ సీఎండీ సలహాదారు డీకే సేన్ గారు, ఎల్ అండ్ టీ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి గార్లు పాల్గొన్నారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →