Tg cast census report - తెలంగాణ కలగణన నివేదిక విడుదల - bikki news

TG CAST CENSUS REPORT – తెలంగాణ కలగణన నివేదిక విడుదల

BIKKI. NEWS (JULY 19) : Telangana cast census report released. తెలంగాణలో చేప‌ట్టిన కుల‌గ‌ణ‌నను అధ్య‌య‌నం చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన స్వ‌తంత్ర‌ నిపుణుల క‌మిటీ ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించింది. ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే – 2024 (SEEEPCS) పూర్తి శాస్త్రీయంగా, విశ్వసనీయంగా ఉందని నిపుణుల కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది. తెలంగాణలో పూర్తి చేసిన ఈ సర్వే చారిత్రాత్మకమని, దేశానికి రోల్ మాడల్ గా నిలుస్తుందని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.

Telangana cast census report released

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ) లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారికి ఇండిపెండెంట్ ఎక్స్ పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి గారి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ సభ్యులు 300 పేజీల నివేదికను సమర్పించారు.

నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలు, సూచనలను మంత్రిమండలి సమావేశంలో చర్చించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించింది.

బలహీన వర్గాల అభ్యున్నతి

రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు, అందుకు కారణాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయాలని కోరారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల అవసరాలను గుర్తించి సరైన సూచనలు ఇవ్వాలని కమిటీని కోరారు.

సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది.

మొదటి దశలో 2024 నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు 50 రోజుల పాటు రాష్ట్ర మంతటా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాకు చెందిన సమాచారం సేకరించేందుకు ప్రతి జిల్లాలో ప్రతి 150 కుటుంబాలను ఒక బ్లాక్ గా ఎంచుకుంది. ఒక్కో బ్లాక్ కు ఒక ఎన్యుమరేటర్ ను, ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్ వైజర్ ను నియమించింది.

రాష్ట్ర వ్యాప్తంగా 1,03,889 మంది ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లతో శాస్త్రీయంగా సర్వే చేయించింది. మొదటి విడతలో రాష్ట్రంలో 96.9 శాతం కుటుంబాలను సర్వే చేసి ఆయా కుటుంబాల వివరాలను 36 రోజుల్లో డేటాను ప్రత్యేకంగా ఎంట్రీ చేయించింది.

మొదటి దశలో హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు కొన్ని వేర్వేరు కారణాలతో సర్వేలో తమ వివరాలు నమోదు చేయకపోవటంతో ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రెండో విడతలో వివరాల నమోదుకు అవకాశం కల్పించింది. మీ సేవా కేంద్రాలు, జీహెచ్ఎంసీ, ఎంపీడీవో ఆఫీసులు, వెబ్ సైట్ ద్వారా తమ వివరాలకు నమోదు చేసుకునే వీలు కల్పించింది.

సమగ్ర రూపం

ఈ సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో 1,15,71,457 గృహాలు ఉన్నాయి. 1,12,36,849 (97.10%) కుటుంబాల నుంచి 3,55,50,759 మంది ఈ సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు.

ఈ సమగ్ర కుల గణన సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 61,91,294 మంది (17.42%), ఎస్టీలు 37,08,408 మంది (10.43%), బీసీలు 2,00,37,668 మంది (56.36%), ఇతర కులాలకు చెందిన వారు 56,13,389 మంది (15.89%) మంది ఉన్నట్టు తేలింది. ఈ సర్వే వివరాల నివేదికను ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించింది.

సర్వే ఫలితాలను అధ్యయనం చేసి విధాన నిర్ణయాలను రూపొందించేందుకు వీలుగా సర్వే డేటాను విశ్లేషించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సుదర్శన్ రెడ్డి గారి అధ్వర్యంలో 11 మంది సభ్యులతో స్వతంత్ర్య నిపుణుల వర్కింగ్ గ్రూపును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సర్వే ఫలితాలను విశ్లేషించి వివరణాత్మక నివేదికను అప్పగించే బాధ్యతను ఈ నిపుణుల కమిటీకి అప్పగించింది.

వివిధ దఫాలుగా సమావేశాలు జరిపిన కమిటీ డేటాను సేకరించిన పద్దతి శాస్త్రీయంగా నిశితంగా ఉందని గుర్తించింది. ప్రభుత్వ విధానాల రూపకల్పనతో పాటు ఇప్పుడు అమల్లో ఉన్న విధానాలను మెరుగుపరిచేందుకు, సామాజిక న్యాయం, సామాజిక సాధికారత, వెనుకబడిన బలహీనవర్గాల వర్గాల అభ్యున్నతిని మెరుగుపరిచేందుకు సర్వే సహాయపడుతుందని కమిటీ సూచించింది.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →