Today telangana cabinet meeting decisions - కేబినెట్ సమావేశ నిర్ణయాలు - bikki news

Today Telangana cabinet meeting decisions – కేబినెట్ సమావేశ నిర్ణయాలు

BIKKI NEWS (JUNE 18) : Today telangana cabinet meeting decisions on June 18th 2026. ఈరోజు తెలంగాణ క్యాబినెట్ సమావేశమైంది ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది.

Today telangana cabinet meeting decisions on June 18th 2026

వానాకాలం పంటలకు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశం నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మధిరలో పెద్దఎత్తున రైతుల సమ్మేళనం నిర్వహించాలని తీర్మానించింది.

రైతుల సమ్మేళనం సందర్భంగా అదే వేదికగా రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. సన్న ధాన్యానికి సంబంధించి ఏడు రకాల సన్నాలకు బోనస్ చెల్లించాలని నిర్ణయించారు. మార్కెట్‌లో ఉన్న డిమాండ్, ప్రజల వినియోగం, అధిక దిగుబడి వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

దీని ప్రకారం బీపీటీ -5204, ఆర్‌ఎన్‌ఆర్ -15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, కేఎన్‌ఎం-7715.. ఏడు రకాల సన్నాలకు బోనస్ వర్తిస్తుంది.

రాష్ట్రంలో రైతులు ఈ ఏడాది దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధిక ధాన్యం పండించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఇప్పటికే దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.

సమావేశం అనంతరం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర రావు గారు, ధనసరి అనసూయ సీతక్క గార్లు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి తక్కువ ధాన్యాన్ని సేకరించటంపై మంత్రుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని సమావేశం భావించినట్టు మంత్రులు తెలిపారు.

వానాకాలం సీజన్ కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని సమావేశం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రైతులు ఇబ్బంది పడకుండా ఎరువుల కోటాను విడుదల చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. వెంటనే ఎరువుల కోటాను విడుదల చేయాలని కోరుతూ త్వరలో ఢిల్లీకి వెళ్లి మరోసారి కేంద్రాన్ని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.

తెలంగాణలోని రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కంపెనీలో ఉత్పత్తి అవుతున్న యూరియాలో అత్యధిక కోటా రాష్ట్రానికే కేటాయించాలని సమావేశం డిమాండ్ చేసింది. ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు పంపించకుండా తెలంగాణ యూరియాను కేటాయిస్తే రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయని సమావేశం అభిప్రాయపడింది.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి కొత్తగా కేంద్రం తెచ్చిన వీబీజీ రామ్ జీ పథకాన్ని కాకుండా పాత ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని సమావేశం తీర్మానించినట్టు మంత్రులు పేర్కొన్నారు.

కొత్త చట్టం అమలుతో కూలీలపైనా, రాష్ట్ర ప్రభుత్వంపై పడే ప్రభావాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, సీతక్క గారు, వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు.

మెట్రో ఫేజ్ -2 విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి ఒప్పందం ప్రకారం రావలసిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని సమావేశం కోరింది.

హైదరాబాద్ ట్రాఫిక్, ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మెట్రో ఫేజ్ – 2 విస్తరణ అత్యంత కీలకం. అందుకే మన రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలందరూ కూడా మెట్రో విస్తరణకు సహకరించాలని కోరుతున్నాం.

ఈ నెల 21న జాతీయ స్థాయిలో జరిగే నీట్ పరీక్షకు రాష్ట్రంలో దాదాపు 208 పరీక్ష కేంద్రాల్లో 2 లక్షల 95 వేల మంది విద్యార్థులు హాజరవుతున్న నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని సమావేశం నిర్ణయించినట్టు మంత్రులు తెలిపారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →