BIKKI NEWS (MAR. 04) : Review meeting by CM Revanth Reddy with collectors. ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆలోచనను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు.
Review meeting by CM Revanth Reddy with collectors
మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. 99 రోజుల కార్యక్రమాల కార్యాచరణను వివరించి, వివిధ అంశాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానమని, వారి సర్వీస్ కెరీర్‌కు పునాదిగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జిల్లా కలెక్టర్లు వారధిగా పని చేయాలని సూచించారు. “ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ప్రజా సమస్యలు అర్థం కావు. నెలలో కనీసం 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలి” అని ఆదేశించారు.
కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసి నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఆషామాషీగా ఐఏఎస్ కాలేరు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్థకత చేకూరుతుంది. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా రాణించగలరు” అన్నారు.
“కలెక్టర్ల పనితీరును ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంది. మీరు మంచి పనిచేస్తే మిమ్మల్ని అభినందిస్తుంది. పనితీరుకు సంబంధించి వార్షిక నివేదికల ఆధారంగా బేరీజు వేస్తాం. వచ్చే జూన్‌లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం” అని తెలిపారు.
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగే ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.
గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో 99 రోజుల ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
శాఖల వారీగా 10 వారాలపాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలిపారు.
గ్రామ, వార్డు సభల్లో నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుల ముఖ గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని, అర్హులకు తప్పనిసరిగా లబ్ధి చేరేలా చూడాలని ఆదేశించారు. అనర్హులు లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు ఒక అధికారికి బాధ్యత ఇవ్వాలని సూచించారు. కలెక్టర్లు వారానికి ఒకసారైనా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయాలని తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం తొలి రోజైన జూన్ 12న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రులను తరచుగా సందర్శించి సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు.
మిల్లర్ల వద్ద నుంచి ధాన్యాన్ని తిరిగి రాబట్టాలని, ఇసుక మాఫియా మరియు అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఔట్‌సోర్సింగ్ నియామకాలలో అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని, పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించాలని సూచించారు.
భూభారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించి, ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ విజన్ అమలులో జిల్లా కలెక్టర్లు పూర్తి భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి గారు తెలిపారు.
- contract jobs in KVS Siddipet – కేంద్రీయ విద్యాలయ సిద్దిపేటలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
- Annual grade increments – 2023 బ్యాచ్ డీఎల్స్ కు ఇంక్రిమెంట్ లు విడుదల చేయండి – హైకోర్టు
- University of Hyderabad jobs – హైదరాబాద్ యూనివర్సిటీలో 37 ఫ్యాకల్టీ పోస్టులు
- Today Gold Rate September 25th 2026 – బంగారం ధర
- TG cabinet meeting – అక్టోబర్ 1న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

