BIKKI NEWS : eHRMS in Telangana 2026 for government employee. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సర్వీసు రికార్డుల నిర్వహణను డిజిటలైజ్ చేయడానికి తెలంగాణ సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ(IFMIS)లో భాగంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(e HRMS)ను అమల్లోకి తెస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
eHRMS in Telangana 2026 for government employee
సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, క్షేత్రస్థాయి ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ఈ విధానాన్ని వర్తింపజేయనున్నారు.
ప్రస్తుతం ఉద్యోగుల సర్వీసు రికార్డులు అధికంగా భౌతిక దస్త్రాల రూపంలో ఉండటంతో వివరాల పరిశీలనలో జాప్యం, వివిధ శాఖల్లో భిన్నమైన విధానాలు, పెండింగ్ వ్యవహారాల పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించేందుకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరాలను డిజిటల్ సర్వీస్ రిజిస్టర్(DSR) రూపంలో నిర్వహించనున్నారు.
సెలవుల మంజూరు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, బదిలీలు, వార్షిక రహస్య నివేదికలు(ACR), వార్షిక పనితీరు మదింపు నివేదికలు(APAR), స్థిరాస్తుల వివరాల సమర్పణ(IPR), విజిలెన్స్ వ్యవహారాలు, పదవీ విరమణకు సంబంధించిన కేసులను ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు.
దస్త్రాల ప్రారంభం నుంచి పరిశీలన, ఆమోదం, పరిష్కారం వరకు నిర్దేశిత విధానంలో ప్రక్రియ సాగుతుంది. e HRMS అమలు పర్యవేక్షణ బాధ్యతలను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్కు అప్పగించారు.

