BIKKI NEWS (SEP. 23) : CM DEMANDING FOR MEDARAM JATARA AS A NATIONAL FESTIVAL. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ.. మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. కుంభమేళా స్థాయిలో జరిగే ఈ మహాజాతరకు జాతీయ గుర్తింపునివ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులను విడుదల చేయాలని కోరారు.
CM DEMANDING FOR MEDARAM JATARA AS A NATIONAL FESTIVAL
వచ్చే ఏడాది ప్రారంభంలో శ్రీ సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణ శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికపై మేడారంలో ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. అనంతరం జరిగిన సభలో సమ్మక్క, సారలమ్మ గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణ ప్రణాళిక నమూనాను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. “సమ్మక్క సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునర్నిర్మాణం చేపట్టే అవకాశం దక్కడంతో నా జన్మ ధన్యమైంది. ఇది బాధ్యతతో కూడిన భావోద్వేగం. ప్రజా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిసారీ సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదాలు తీసుకుంటున్నా.
గతంలో పాలకులు ఆలయ అభివృద్ధిపై వివక్ష ప్రదర్శించారు. ఆలయ అభివృద్ధికి ప్రతి సందర్భంలోనూ ఆనాటి పాలకులకు విజ్ఞప్తి చేస్తూ వచ్చాను. వారేదో దాన, ధర్మమిచ్చినట్టుగా తాత్కాలిక పనులతో సరిపెట్టారు. తాను ఇక్కడి నుంచే పాదయాత్ర బయలుదేరా.
ఆదివాసీలే ఈ దేశానికి మూల వాసులు. దొరల పాలనను అంతం చేసి ప్రజా పాలనకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాం. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రణాళిక అందించింది.
బడుగు బలహీన వర్గాలకు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినప్పుడు సరిపోవని ఆదివాసీ, గిరిజన ప్రాంత వాసులు చెప్పినప్పుడు ఐటీడీఏ ప్రాంతాల్లో వారికి అదనంగా ఇండ్లు ఇచ్చాం.
ప్రభుత్వం అమలు చేసే ఏ కార్యక్రమమైనా ఆదివాసీలకు ఇవ్వాల్సిన వాటా, కోటా ఇవ్వాల్సిందే. దశాబ్దాలుగా వారికి అన్యాయం జరిగింది. వాటన్నింటినీ సరిదిద్దాలని ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
గద్దెలు, ప్రాంగణ అభివృద్ధి నిర్మాణం జీవితంలో వచ్చిన గొప్ప, అరుదైన అవకాశం. సమ్మక్క, సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టడంతో జన్మ ధన్యమైంది. వాటి నిర్మాణంలో నిధుల సమస్య ఉండదు. ఆలయ ప్రాంగణ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ప్రభుత్వం పూర్తి చేస్తుంది.
ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునే ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఇందులో వారిని భాగస్వాములను చేస్తున్నాం. సిమెంట్ కన్నా రాతి కట్టడాలతో నిర్మాణాలు చేపడితే వేల ఏండ్లు ఉంటుంది. గొప్ప నగిశీలు, రాతి కట్టడాలతో రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలని ప్రణాళికలు వేశాం.
ఈ గొప్ప కార్యక్రమంలో మీరంతా భాగస్వాములు కావాలి. ఆదివాసీ సోదరుల కోరిక మేరకు ఈ ప్రణాళిక తీసుకొచ్చాం. వచ్చే జాతర నాటికి కార్యక్రమాలు పూర్తి కావాలంటే రాత్రింబవళ్లు ఇక్కడ పనులు జరగాలి. ఆలయ అభివృద్ధితో పాటు జంపన్న వాగు నిర్మాణం, రహదారుల నిర్మాణాలపైన కూడా సలహాలు, సూచనలు తీసుకుంటాం.
రాబోయే వంద రోజులు ప్రతి వారం జిల్లా ఇంచార్జీ మంత్రి గారు ఇక్కడికి వచ్చి పనులను పర్యవేక్షించాలి. నిష్టతో స్వామి అయ్యప్ప మాల వేసుకున్న తీరుగా సమ్మక్క సారలమ్మ మాల ధరించిన రీతిలో పనులను పర్యవేక్షించాలి. పనులు పూర్తయిన తర్వాత మళ్లీ ఇక్కడ పర్యటిస్తా.
మేడారం జాతరను ఈసారి అత్యంత అద్భుతంగా చేసుకుందాం. ఈ ఆదివాసీ కుంభమేళాను జాతీయ పండుగగా గుర్తించాలని కోరుతున్నాం. కుంభమేళాకు వేల కోట్ల నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు కూడా నిధులను మంజూరు చేయాలి. అందరం కలిసి ఒక మంచి సంకల్పంతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు కష్టపడి పనిచేద్దాం..” అని పిలుపునిచ్చారు.
ఈ సభలో మంత్రులు కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, తెలంగాణలోని గిరిజన ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆదివాసీ ప్రతినిధులు, గిరిజనులు పాల్గొన్నారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
