Cm revanth reddy - విద్య మీద వ్యయం భవిష్యత్తుకు పెట్టుబడి - bikki news

CM Revanth Reddy – విద్య మీద వ్యయం భవిష్యత్తుకు పెట్టుబడి

హైదరాబాద్ (ఏప్రిల్ 08) : Today CM Revanth Reddy review meeting News. సమాజాభివృద్ధికి చేసే కార్యక్రమాలను ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యారు.

Today CM Revanth Reddy review meeting News

ఈ సందర్భంగా మాట్లాడుతూ, కంపెనీలు సీఎస్ఆర్‌కు చేస్తున్న వ్యయం వందకు వంద శాతం సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. కంపెనీలు వీటితో పాటు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని ముఖ్యమంత్రి గారు సూచించారు.

ప్రభుత్వంతో పాటు కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను వారు అందిపుచ్చుకునేలా తయారు చేయగలమని ముఖ్యమంత్రి గారు అన్నారు. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్యలో హైదరాబాద్ నగరంలోనే 44 శాతం ఉన్నారని.. వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని కోరారు.

సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటి వరకు సరైన విధానం లేనందున దీని కోసమే తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించామని ముఖ్యమంత్రి గారు తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ఆ అధికారితో సమన్వయం చేసుకొని తమకు ఆసక్తి ఉన్న విద్య, వైద్యం, జల వనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సీఎస్ఆర్ నిధులు వినియోగించవచ్చని ముఖ్యమంత్రి గారు సూచించారు.

ఇప్పటికే రహేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయని.. వారికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు.

కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ సీఎస్ఆర్ నిధుల విషయంలో ఇప్పటి వరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపారు. ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలిపారు. పాఠశాల విద్య, ఆసుపత్రులు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు వారు ఆసక్తి చూపారు.

సమావేశంలో రహేజా ఫౌండేషన్ నుంచి శ్రావణ్ కుమార్ గారు, రాంకీ ఫౌండేషన్ నుంచి దాక్షాయణి ఆళ్ల గారు, యశోద ఆసుపత్రి నుంచి డాక్టర్ గోరుకంటి సురేందర్ రావు గారు, గోరుకంటి ఫల్గుణ్ రావు గారు, మేఘా గ్రూప్ నుంచి సుధా రెడ్డి గారు, అపోలో ఆసుపత్రుల గ్రూప్ నుంచి అపర్ణా రెడ్డి గారు, కామినేని భాస్కర్ రెడ్డి గారు, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి శేఖర్ రెడ్డి గారు, NAADAM ఫౌండేషన్ నుంచి పగిడిపాటి దేవయ్య గారు, రుద్రమదేవి గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి గారు, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా గారు, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రే గారు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన గారు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు తదితరులు పాల్గొన్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →