TODAY CABINET DECISIONS – ఈరోజు కేబినెట్ నిర్ణయాలు

BIKKI NEWS (AUG. 30) : Today Telangana cabinet decisions. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

Today Telangana cabinet decisions

ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. కొంత ప్రాణ నష్టంతో పాటు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, చెరువులు దెబ్బతిన్నాయి. ఉన్నతాధికారులు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పూర్తి వివరాలతో రావాలని ఆదేశించడం జరిగింది. సోమవారం సాయంత్రం ఆ నివేదికను పరిశీలించి నిధులు మంజూరు చేయాలని కేబినెట్ తీర్మానించింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో వందల సంఖ్యలో గోశాలలు ఉన్నప్పటికీ వాటిలో గోవులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా.. మంత్రి మండలి గోశాల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించింది. ఇప్పుడు వాటికి సంబంధించిన స్పష్టమైన విధి విధానాలను రూపొందించుకొని ఆమోదించడం జరిగింది.

నీటి పారుదల రంగంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కింద వస్తున్న మద్దతుపై మంత్రివర్గంలో చర్చించి నేషనల్ హైడ్రాలజీ ఎక్విప్ మెంట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.

2022-23 రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరించిన గత ప్రభుత్వం టెండర్లు పిలిచి ఉద్దేశపూర్వకంగా పొడిగిస్తూ వచ్చింది. 2023 డిసెంబర్ 7 వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విధానపరమైన నిర్ణయం తీసుకొని టెండర్లు ఫైనలైజ్ చేసినప్పటికీ మిల్లర్ల దగ్గర మిగిలిపోయిన సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తిరిగి ఇవ్వలేదు. రికవరీ కాని ధాన్యానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ న్యాయపరమైన అంశాలను క్షుణంగా పరిశీలించి మిల్లర్లు డబ్బులు చెల్లించకపోతే చర్య తీసుకోవడానికి వెనకాడవద్దని మంత్రి మండలి నిర్ణయించింది. అవసరమైతే మిల్లర్లపై పీడీ యాక్ట్ పెట్టాలని మంత్రి మండలి తీర్మానం చేసింది.

రాష్ట్రంలో మత్స్య సహకార సంఘాలు ఉన్నప్పటికీ వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఆలస్యమవుతున్నందున సహకార సంఘాలకు పర్సనల్ ఇంఛార్జ్ లు నియమించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సంఘంలో సభ్యులుగా ఉన్న వారినే పర్సనల్ ఇంఛార్జ్ లుగా నామినేట్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది

అదే విధంగా గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా ప్రొఫెసర్ కోదండరామ్, అజారుద్దీన్ పేర్లకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.