BIKKI NEWS : Telangana Police jobs recruitment upto 2028: తెలంగాణ పోలీస్ శాఖలో సిబ్బంది కొరతను పూర్తిగా నివారించేందుకు 2028 నాటికి అన్ని ఖాళీలను విడతలవారీగా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
Telangana Police jobs recruitment upto 2028
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి ప్రకటన కీలకంగా మారింది. 2025 అక్టోబర్ నాటికి దాదాపు 16 వేల మంది కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలను నియమించినట్లు సీఎం వెల్లడించారు. అలాగే, 2026లో పోలీస్ శాఖలో మరో 5,000 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
112 మంది డీఎస్పీల నియామకం
పోలీసు శాఖలో ఉన్నతాధికారుల కొరతను తగ్గించే దిశగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ లేని విధంగా 112 మంది డీఎస్పీలను నియమించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆత్మగౌరవాన్ని పెంపొందించామని పేర్కొన్నారు.
పోలీసు అమరవీరుల కుటుంబాలకు భారీ పరిహారం
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు అందించే ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం పెంచినట్లు సీఎం వివరించారు.
- కానిస్టేబుళ్లు: రూ.40 లక్షల నుంచి రూ.1 కోటికి పెంపు.
- హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు: రూ.45 లక్షల నుంచి రూ.1 కోటికి పెంపు.
- ఎస్‌ఐలు: రూ.45 లక్షల నుంచి రూ.1.25 కోట్లకు పెంపు.
- ఇన్‌స్పెక్టర్లు: రూ.50 లక్షల నుంచి రూ.1.25 కోట్లకు పెంపు.
- డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు: రూ.50 లక్షల నుంచి రూ.1.50 కోట్లకు పెంపు.
- ఎస్పీ, ఐపీఎస్ అధికారులు: రూ.1 కోటి నుంచి రూ.2 కోట్లకు పెంపు.
అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, విద్య, వైద్య సహాయం
పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. అర్హులైన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ఇంటి స్థలం, ఉచిత విద్య, వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. వైద్య విద్యలో ప్రత్యేక సీట్లను కూడా అమలు చేస్తున్నామని వెల్లడించారు.
అలాగే, భద్రత సంక్షేమ నిధి నుంచి రూ.16 లక్షలు, సంక్షేమ నిధి నుంచి మరో రూ.8 లక్షలు అందించాలని నిర్ణయించినట్లు వివరించారు.
హోంగార్డుల ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంపు
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డుల కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని డీజీపీని ఆదేశిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ప్రాంతంలో 44 ఎకరాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.
సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై ప్రత్యేక దృష్టి
సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆహార కల్తీ వంటి సమస్యలను సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
యువత డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ పనితీరును అభినందించారు.
ఆహార కల్తీని అరికట్టేందుకు టీజీ సేఫ్ (TG SAFE) కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. మహిళల భద్రత కోసం షీ-టీమ్స్ సేవలను కొనసాగిస్తున్నామని, మహిళలకు అండగా నిలిచేందుకు ఈ ఏడాది మార్చిలో ‘StandWithHer’ కార్యక్రమాన్ని, మహిళలు, పిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ రక్షణ కల్పించేందుకు ఏప్రిల్‌లో ‘స్పందన’ బృందాలను ప్రారంభించినట్లు వివరించారు.
Telangana Police jobs recruitment upto 2028 – శాంతిభద్రతలే రాష్ట్ర అభివృద్ధికి పునాది
రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు, రహదారులు, భవనాలు మాత్రమే సరిపోవని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు నిర్భయంగా జీవించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
పరిశ్రమలు, ఐటీ రంగం, పర్యాటకం అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు పటిష్టంగా ఉండాలని పేర్కొన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వం పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు సీఎం పిలుపు
పోలీసులు సామాన్య ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, నేరస్థుల విషయంలో కఠినంగా ఉండాలని సీఎం సూచించారు. సమస్యల పరిష్కారం కోసం పోలీసుల వద్దకు వచ్చే ప్రజల్లో నమ్మకం కలిగించేలా ప్రవర్తించాలని చెప్పారు.
పోలీసు అమరవీరులకు ఘన నివాళులు
దేశవ్యాప్తంగా ఈ ఏడాది విధి నిర్వహణలో 154 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

