BIKKI NEWS : Supreme court on contract lecturers regularisation. తెలంగాణలో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒకే తరహా విద్యార్హతలు కలిగిన కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించి, మరికొందరిని అనర్హులుగా ప్రకటించడం వివక్షతో కూడుకున్నదన్న అంశంపై దాఖలైన కేసులో సుప్రీంకోర్టు కీలక చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Supreme court on contract lecturers regularisation
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తమ సమాధానాలు తెలియజేయాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అసలు వివాదం ఏమిటి?
2008 అక్టోబర్‌లో సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని రీజినల్ డైరెక్టర్ కొందరిని కాంట్రాక్ట్ పద్ధతిలో కెమిస్ట్రీ లెక్చరర్లుగా నియమించారు. వీరి సేవలను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సంబంధిత లెక్చరర్ల విద్యార్హతల పరిశీలన ప్రక్రియను ప్రారంభించింది.
ఈ పరిశీలనలో కొందరు అభ్యర్థులు మధ్యప్రదేశ్‌లోని ఓపెన్ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో పీజీ చేసినట్లు గుర్తించారు. దీంతో 2022లో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. వారు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవని పేర్కొంటూ 2022 జూలై 17న వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు.
హైకోర్టును ఆశ్రయించిన బాధిత లెక్చరర్లు
ఉద్యోగాల నుంచి తొలగించడంతో బాధిత లెక్చరర్లు 2023లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తాము చదివిన ఓపెన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ పొందిన మరికొందరు ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని, తమను మాత్రం అనర్హులుగా ప్రకటించడం వివక్షతో కూడుకున్నదని వాదించారు.
తమకు కూడా సమాన న్యాయం చేయాలని కోరారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం, అనంతరం డివిజన్ బెంచ్ కూడా బాధిత అభ్యర్థులకు అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి.
131 మంది ఉద్యోగుల వ్యవహారం కూడా కీలకం
ఇదే తరహా విద్యార్హతలు కలిగి ఉండి ఇప్పటికే రెగ్యులరైజ్ అయిన 131 మంది అభ్యర్థులను కూడా ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే వారిలో కొందరు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాదనలు
హైకోర్టు తీర్పులను సవాల్ చేస్తూ తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించి, అదే తరహా విద్యార్హతలు ఉన్న మరికొందరిని విస్మరించడం వివక్ష కిందికి వస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. గుర్తింపు లేని దూరవిద్యా సంస్థల్లో చదివి లెక్చరర్ పోస్టులు పొందే అంశంపై సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టత ఇచ్చిన విషయాన్ని కూడా ఈ కేసులో ప్రస్తావించారు.

