BIKKI NEWS (Sep. 23) : Employees JAC – CS Meeting . ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల మధ్య జరుగుతున్న చర్చలు మరోసారి వాయిదా పడ్డాయి. మంగళవారం సాయంత్రం జరగాల్సిన చర్చలు ప్రారంభం కాకుండానే బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని జేఏసీ నేతలు కోరుతున్నారు.
Employees JAC – CS Meeting
సీఎస్ కోసం గంటల తరబడి ఎదురుచూపులు:
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో చర్చల కోసం ఉద్యోగుల జేఏసీ నేతలు మంగళవారం సాయంత్రం 5.30 గంటలకే సచివాలయానికి చేరుకున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో పలు సమీక్షలు నిర్వహించడంతో సీఎస్ వాటికి హాజరయ్యారు. దీంతో జేఏసీ నేతలు సీఎస్ చాంబర్లో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై స్పష్టత లేకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు చర్చలు:
చాలాసేపు ఎదురుచూసిన అనంతరం జేఏసీ నేతలు నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌కు వెళ్లిపోయారు. అనంతరం సీఎస్ సంజయ్ జాజు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావుకు ఫోన్ చేసి చర్చలను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తామని తెలిపారు. జేఏసీ ప్రస్తావించిన నాలుగు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
రెండు రోజుల్లో నాలుగుసార్లు వాయిదా:
ఉద్యోగుల జేఏసీతో చర్చలు రెండు రోజుల్లో నాలుగుసార్లు వాయిదా పడటంపై ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సీఎస్‌తో ప్రారంభమైన చర్చలు తొలుత అదే రోజు రాత్రికి, అనంతరం మంగళవారం సాయంత్రం 6 గంటలకు వాయిదా పడ్డాయి. మంగళవారం కూడా చర్చలు జరగకపోవడంతో తాజాగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. వరుస వాయిదాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో ఆందోళన నెలకొంటోందని జేఏసీ నేతలు పేర్కొన్నారు.
పది లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం త్వరగా స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చర్చలను వెంటనే పూర్తి చేసి నిర్ణయాలు ప్రకటించాలని కోరారు. వరుసగా చర్చలు వాయిదా పడటం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోందని ఉద్యోగ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జరగనున్న చర్చల్లో తమ నాలుగు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తుందని జేఏసీ నేతలు ఆశిస్తున్నారు.

