KALESWARAM – కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ

Kaleswaram - కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ - bikki news

BIKKI NEWS (SEP. 01) : CBI ENQUIRY ON KALESWARAM PROJECT. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం – జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదికపై శాసనసభలో సుదీర్ఘంగా చర్చించిన మీదట తదుపరి విచారణకు ఈ మొత్తం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు శాసనసభలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు.

CBI ENQUIRY ON KALESWARAM PROJECT.

“కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతి ఆరోపణలపై విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించడం జరిగింది.

దీనిపై విచారణ కమిషన్ తన నివేదికను జూలై 31, 2025 వ తేదీన ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4, 2025 వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశం ఆ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ కోసం నివేదికను శాసనసభ ముందు ఉంచాలని నిర్ణయించింది. ఆ మేరకు ఈ అంశంపై శాసనసభలో చర్చ జరిగింది.

జస్టిస్ ఘోష్ కమిషన్ తన నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చిచెప్పింది.

NSDA నివేదిక

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA నివేదిక ప్రకారం మేడిగడ్డ నిర్మాణ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యతా నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ, విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి.

ప్రాజెక్టులో అంతర్ రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్‌లో, వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI కి అప్పగించడం సముచితం. అందుకే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం తీసుకుంటున్నది.

ఎన్నో రకాలైన అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండటం వల్ల సీబీఐ విచారణకు ఆదేశించాలని నిర్ణయించడం జరిగింది. నిజాయితీతో కూడిన విచారణ జరగాలని కోరుకుంటున్నాం.. అని కమిషన్‌ నివేదికపై చర్చకు సమాధానంగా ముఖ్యమంత్రి గారు వివరించారు.

అంతకుముందు జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదికను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభ ముందుంచారు. అనంతరం స్పీకర్ గారి అనుమతి మేరకు మంత్రి గారు స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు.

తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని మార్చడం నుంచి మేడిగడ్డ స్పీయర్స్ కుంగిపోయిన పరిణామాల వరకు, తదనంతరం జస్టిస్ ఘోష్ గారి నేతృత్వంలో విచారణ కమిషన్ నియామకం వరకు వివరాలను సభలో తెలియజేశారు.

చర్చపై ముఖ్యమంత్రి గారు సమాధానమిస్తూ, ఘోష్ కమిషన్ ఏర్పాటు నేపథ్యం, కమిషన్ సమర్పించిన 665 పేజీల నివేదికలోని సారాంశాన్ని, జరిగిన చర్చ వివరాలను ప్రస్తావించారు. నివేదికల్లో అనేక అంశాలతో మల్టిపుల్ కాంప్లికేషన్స్ తో ముడిపడి ఉన్నందున ఎలాంటి శషభిషలకు తావులేకుండా ఒక స్పష్టమైన, నిర్ధిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలనుకున్న ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →