INTER EXAMS IN FEBRUARY – ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరిలోనే

BIKKI NEWS (AUG. 31) : AP INTERMEDIATE PUBLIC EXAMS 2026 IN FEBRUARY. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఫిబ్రవరిలోనే నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రణాళిక సిద్ధం చేసింది.

AP INTERMEDIATE PUBLIC EXAMS 2026 IN FEBRUARY.

ఇప్పటివరకు మార్చిలో జరిగే పరీక్షలను ఈసారి సీబీఎస్ఈ తరహాలో ముందుగానే నిర్వహించనున్నారు. ఏప్రిల్‌లో తరగతులు ప్రారంభించేందుకు పరీక్షలను త్వరగా పూర్తిచేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

పరీక్షల విధానంలో మార్పులు

సైన్స్ గ్రూప్ విద్యార్థులకు మొదట గ్రూప్ సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభమవుతాయి. రోజుకు ఒక్క సబ్జెక్టు మాత్రమే నిర్వహించనున్నారు. గతంలో ఎంపీసీ విద్యార్థులకు గణితం ఉంటే, అదే రోజున బైపీసీ లేదా ఆర్ట్స్ విద్యార్థులకు ఇతర సబ్జెక్టులు ఉండేవి. ఈసారి ఆ విధానాన్ని మార్చారు.

ఎంబైపీసీ గ్రూపు ప్రవేశపెట్టడంతో ఎంపీసీ విద్యార్థులు జీవ శాస్త్రాన్ని కూడా చదివే అవకాశం వచ్చింది. కాబట్టి ఒకే రోజున రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాదు. అందువల్ల ప్రతి రోజు ఒక్క పరీక్ష మాత్రమే ఉంటుంది. సైన్స్ గ్రూపు పరీక్షలు పూర్తయిన తర్వాత భాషా పేపర్లు, అనంతరం ఆర్ట్స్ గ్రూపు పరీక్షలు నిర్వహించనున్నారు.

ప్రాక్టికల్ పరీక్షలు

ప్రాక్టికల్స్‌ను జనవరి చివరిలోనా? లేక రాతపరీక్షల అనంతరమా? అనేది ఇంకా తేలాల్సి ఉంది.

ప్రథమ సంవత్సరంలో ప్రధాన సంస్కరణలు

ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అనేక సంస్కరణలు అమలులోకి వచ్చాయి.

పూర్తిగా ఎన్సీఈఆర్టీ సిలబస్ ను అనుసరిస్తున్నారు. ఎంబైపీసీ కోర్సుతో ఎంపీసీ విద్యార్థులకు జీవశాస్త్రం చదివే అవకాశం కల్పించారు.

ఆర్ట్స్ విద్యార్థులు సైతం కొందరు సైన్స్ సబ్జెక్టులను ఎంచుకోగా, సైన్స్ గ్రూపు విద్యార్థులు కొందరు రాజనీతిశాస్త్రం, చరిత్ర, ఆర్థికశాస్త్రం వంటి ఆర్ట్స్ సబ్జెక్టులను ఎంచుకున్నారు.

ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ వంటి ఉన్నత విద్యలో అర్హత పొందేందుకు ఈ తరహా సబ్జెక్టు ఎంపికలను విద్యార్థులు ఎంచుకుంటున్నారు.

ప్రశ్నపత్రాల్లో కొత్త విధానం

ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రశ్నపత్రాల విధానంలోనూ మార్పులు చేశారు.

భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులను 85 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. మిగిలిన మార్కులు రెండవ సంవత్సర ప్రాక్టికల్స్‌లో కలుస్తాయి.

అన్ని పేపర్లలోనూ కొత్తగా ఒక్క మార్కు ప్రశ్నలు ప్రవేశపెట్టారు.

జీవశాస్త్రంలో వృక్షశాస్త్రం 43 మార్కులు, జంతుశాస్త్రం 42 మార్కులకు నిర్వహించనున్నారు.