NSS DAY – జాతీయ సేవా పథకం దినోత్సవం

BIKKI NEWS (SEP. 24) : National Service Scheme Day on September 24th. జాతీయ సేవా పథకం భారత ప్రభుత్వం చేత 1969 సెప్టెంబర్ 24న ప్రారంభించబడిన యువజన కార్యక్రమం ఇది.

National Service Scheme Day on September 24th.

విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం. కానీ భావి భారతాన్ని నిర్ణయించవలసినది యువకులే. ప్రతి దేశ పురోభివృద్ధిలోనూ, ఉద్యమాలలోనూ విద్యార్థులు పాలుపంచుకుంటారు. ఒక్కొక్కసారి ఆవేశం ఎక్కువ కావచ్చు కానీ కల్లాకపటం తేలియని నిర్మల మనస్కులు వీరు. వీరు కూడా సంఘజీవులే, సంఘంలో భాగస్వాములే, కాబట్టి సంఘసేవ (Social service) వాళ్ళకి బాధ్యత ఉంది. విద్యాభ్యాసానికి ఆటంకాలు లేకుండా సంఘసేవ చేసే అవకాశాలున్నాయి.

ఒక మనిషి మరొక మనిషికి సహకరించడం మానవతా లక్షణం. అదేవిధంగా మనం పదిమందిలో ఉన్నప్పుడు మనవల్ల ఆ పదిమందికీ ప్రయోజనం వుండాలి- లేదా మనవల్ల మరొకరికి మేలు కలగాలి. ఆ విధంగా పరస్పర సహకారంగా, పరోపకారంగా, మంచిగా మెలగటమే సంఘసేవ.

డా. డి.ఎస్. కొఠారి (1964-66) నేతృత్వంలోని విద్యా కమిషన్, విద్య అన్ని దశలలో ఉన్న విద్యార్థులను ఏదో ఒక విధమైన సామాజిక సేవతో ముడిపెట్టాలని సిఫారసు చేసింది. 1967 ఏప్రిల్ సంవత్సరంలో రాష్ట్రాల విద్యాశాఖ మంత్రి వారి సమావేశంలో దీనిని పరిగణనలోకి తీసుకున్నారు.

అయితే అప్పటికే విశ్వవిద్యాలయ దశలో, స్వచ్ఛంద ప్రాతిపదికన ఉనికిలో ఉన్న నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్ సి సి) లో చేరడానికి విద్యార్థులను అనుమతించాలని, దీనికి ప్రత్యామ్నాయాన్ని నేషనల్ సర్వీస్ స్కీం (ఎన్ఎస్ఎస్) అని పిలువబడే కొత్త కార్యక్రమం రూపంలో వారికి అందించవచ్చని వారు సిఫార్సు చేశారు.

1969 సంవత్సరంలో సెప్టెంబరులో జరిగిన వైస్ చాన్సలర్స్ కాన్ఫరెన్స్ ఈ సిఫారసు ప్రకారంగా, సమస్యను వివరంగా పరిశీలించడానికి వైస్ చాన్సలర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయవచ్చని సూచించారు. భారత ప్రభుత్వ విద్యపై జాతీయ విధానం ప్రకటనలో, పని అనుభవం, జాతీయ సేవ విద్యలో అంతర్భాగంగా ఉండాలని నిర్దేశించబడింది.

మే 1969 సంవత్సరంలో, విద్యా మంత్రిత్వ శాఖ, విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల విద్యార్థుల ప్రతినిధుల సమావేశం కూడా ఏకగ్రీవంగా ‘జాతీయ సేవ జాతీయ సమైక్యతకు శక్తివంతమైన సాధనం కాగలదని ప్రకటించింది.

పట్టణ విద్యార్థులను గ్రామీణ జీవితానికి పరిచయం చేయడానికి, తద్వారా దేశ పురోభివృద్ధికి, అభ్యున్నతికి విద్యార్థి సమాజం చేస్తున్న కృషికి చిహ్నంగా ఉంటుందని జాతీయ సేవా పథకం తీసుకరావడం జరిగింది. 1969 సెప్టెంబరు 24న అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వి.కె.ఆర్.వి.రావు 37 విశ్వవిద్యాలయాలలో జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Comments are closed.