CM Revanth Reddy : ప్రభుత్వాన్ని నడపడంలో ఉద్యోగుల పాత్ర కీలకం : సీఎం రేవంత్ రెడ్డి

Cm revanth reddy on employees service

BIKKI NEWS (SEP. 30) : CM Revanth Reddy on employees service. ప్రభుత్వంలో పూర్తికాలపు ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో కలిపి పనిచేస్తున్న 10.5 లక్షల మంది ఉద్యోగులే తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. కేవలం 3 శాతం మంది ఉద్యోగులు 95 శాతం ప్రజలకు సేవలు అందించడం ఎంతో శ్రమ, నిబద్ధతతో కూడుకున్న పని అని, ఉద్యోగులంతా అంకితభావంతో పనిచేసినప్పుడే పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా అందుతాయని చెప్పారు.

CM Revanth Reddy on employees service

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ముఖ్యమంత్రి గారు, కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రభుత్వ కార్యాలయాలు పేదవాడికి నమ్మకం, విశ్వాసాన్ని కలిగించేలా ఉండాలని ముఖ్యమంత్రి గారన్నారు. సమస్యలతో, బాధతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే నిరుపేదలను కుటుంబ సభ్యులుగా భావించి సేవలందించాలని ఉద్యోగులను కోరారు.

సంక్షేమ పథకాలు పేదలకు చేరడంలో ప్రభుత్వ ఉద్యోగులే కీలక ప్రతినిధులని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సహా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా దాని వెనుక ఉద్యోగుల పనితీరు ఆధారపడి ఉంటుందని అన్నారు.

ప్రజలకు ప్రభుత్వ నిర్ణయాలు, శాసనాలు, అనుమతులు, సంక్షేమ పథకాల ఫలితాలు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని సీఎం గారు తెలిపారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెలా మొదటి తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని, ప్రమోషన్లు, బదిలీలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ, ఇతర ప్రయోజనాలు, ఆరోగ్య భద్రతకు సంబంధించిన అంశాలను వీలైనంత వరకు పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు.

మొత్తం సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పడం లేదని, ఇంకా సమస్యలున్నాయని చెబుతూ, ప్రజలకు సేవలు అందించుకుంటూనే మన సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పారు.

కరీంనగర్ జిల్లాలో రూ.944 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించామని, మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశామని ముఖ్యమంత్రి గారు తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.840 కోట్ల నిధులు సాధించామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తే ముఖ్యమంత్రిగా అభినందించడంలో ఎలాంటి శషబిషలు లేవన్నారు.

ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, మిగిలిన సమయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మించినా కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకపోతే వాటి ప్రయోజనం ప్రజలకు అందదని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుందని చెప్పారు.

కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలో కంటోన్మెంట్ ప్రాంతం అతిపెద్ద ప్రతిబంధకంగా మారిందని ముఖ్యమంత్రి గారు వివరించారు. గతంలో పలువురు నాయకులు ప్రయత్నించినా పరిష్కారం కాని ఈ సమస్యపై తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ గారిని కలిసి వివరించానని గుర్తుచేస్తూ, ఆరు నెలల్లోనే కంటోన్మెంట్ పరిధిలో దాదాపు 170 ఎకరాల భూమిని రాష్ట్రానికి అందించారని తెలిపారు.

కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు రూ.5 వేల కోట్లతో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్‌ను ఏడాదిలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. బేగంపేట విమానాశ్రయం రన్‌వే కిందినుంచి రహదారి నిర్మించేందుకు కూడా అనుమతులు సాధించామని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో రాజకీయ సిద్ధాంతాలు వేరైనా పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై మరోసారి జిల్లాకు వచ్చి సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →