BIKKI NEWS (SEP. 28) : Banks Bandh postponed. దేశవ్యాప్తంగా బ్యాంక్ ఖాతాదారులకు పెద్ద ఊరట లభించింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపునిచ్చిన మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య ఆదివారం రాత్రి జరిగిన కీలక చర్చలు ఫలించడంతో సమ్మె విరమణ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు నేటి నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా యథావిధిగా పనిచేయనున్నాయి.
Banks Bandh postponed
ప్రధానంగా వారానికి 5 రోజుల పనిదినాల అమలు, పెన్షన్ల అప్‌డేట్, నియామకాల భర్తీ వంటి దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు ఈ నిరసనకు దిగాలని భావించారు.
అయితే గత శని, ఆదివారాల సెలవులకు తోడు మరో మూడు రోజులు బ్యాంకులు బంద్ అయితే ఆర్థిక లావాదేవీలు స్తంభించి తీవ్ర గందరగోళం నెలకొనే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఉన్నతాధికారుల జోక్యంతో జరిపిన చర్చల్లో సానుకూల సంకేతాలు రావడంతో యూనియన్లు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి.
సమ్మె వాయిదా పడటంతో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్, డీడీలు వంటి ప్రత్యక్ష బ్యాంకింగ్ సేవలు బ్రాంచుల్లో సాధారణ రీతిలోనే కొనసాగుతాయి. అలాగే ఆన్‌లైన్ సేవలు, యూపీఐ (UPI), మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం కార్యకలాపాలు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి.
నెల ముగింపు వేళ ఎలాంటి అడ్డంకులు లేకుండా బ్యాంకింగ్ సేవలు పునఃప్రారంభం కావడం సాధారణ ప్రజలతో పాటు వ్యాపారులకు కూడా పెద్ద ఊరటనిచ్చింది.

