• ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు అధ్యక్షతన ట్రస్ట్ సమావేశం
• చికిత్స ప్యాకేజీ రేట్లపై సమగ్ర సమీక్ష
• ఎగ్జిక్యూటివ్ కమిటీ, సబ్ కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయం
• అత్యవసర వైద్య సహాయం అందేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశం
BIKKI NEWS (జూలై 31) : Telangana Employees Health Care Trust guidelines updates. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
Telangana Employees Health Care Trust guidelines updates
హెల్త్ కేర్ ట్రస్ట్ ఫండ్ ను సద్వినియోగం చేసుకునేలా కమిటీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ట్రస్ట్ సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు, ఆసుపత్రుల్లో అందుతున్న సేవలు, చికిత్స ప్యాకేజీ రేట్లు, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చికిత్స ప్యాకేజీ రేట్లను సమగ్రంగా పరిశీలించి, ఉద్యోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా పథకాన్ని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన మార్పులు చేపట్టాలని సూచించారు.
ట్రస్ట్ కార్యకలాపాల నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు అవసరమైన సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కమిటీలు ప్యాకేజీ రేట్లు, ఆసుపత్రుల ఎంపిక, సేవల నాణ్యత, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలను క్రమం తప్పకుండా సమీక్షించి ట్రస్ట్‌కు సూచనలు అందజేయాలి.
అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అవసరమైన ఉద్యోగులు, పెన్షనర్లకు ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణ వైద్య సహాయం అందేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 24 గంటల సహాయ వ్యవస్థ, వేగవంతమైన అనుమతి ప్రక్రియ, సంబంధిత ఆసుపత్రులతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఉద్యోగులు ఆరోగ్య పథకం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ట్రస్ట్ పారదర్శకంగా, సమర్థవంతంగా పని చేయాలని సిఎస్ సూచించారు.
ఈ సమావేశంలో స్పెషల్ సిఎస్ మహేశ్ దత్ ఎక్కా, ముఖ్య కార్యదర్శులు సందీప్ సుల్తానియా, యోగితారాణా, క్రిస్టినా చొంగ్తూ, శిఖా గోయల్,హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఒ జెండగే హనుమంత్ కొండిబా, కార్యదర్శులు శ్రుతి ఓజా, దివ్య, సిక్తా పట్నాయక్, టి.ఎన్.జీ.ఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీ.జీ.ఓ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావు, తెలంగాణ సెక్రెటేరియేట్ అసోసియేషన్ అధ్యక్షులు జి. శ్రీనివాస రెడ్డి, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చిరెడ్డి, పీఆర్ టీయూ కు చెందిన దామోదర్ రెడ్డి, తెలంగాణా యూ.టి.ఎఫ్ కు చెందిన చావా రవి, ఎస్ టి యు అధ్యక్షులు సదానంద గౌడ్, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి, తెలంగాణ రిటైర్డ్ అధికారుల సంఘం మహిళా అధ్యక్షురాలు ఉమా దేవి, ఎస్ టి ఎఫ్ అధ్యక్షులు డి. సైదులు తదితరులు పాల్గొన్నారు.
