బహుజనుల అభివృద్ధికి చదువే మార్గం - సీఎం రేవంత్ రెడ్డి - bikki news

బహుజనుల అభివృద్ధికి చదువే మార్గం – సీఎం రేవంత్ రెడ్డి

BIKKI NEWS (AUG. 18) : CM REVENTH REDDY ON BACKWARD CLASSES. బహుజనులు సమాజంలో ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉద్గాటించారు. బహుజనులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

CM REVENTH REDDY ON BACKWARD CLASSES.

హైదరాబాద్ రవీంద్రభారతిలో శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 375 వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ఆ మహనీయుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ..

బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలని, అందుకే గుండెకాయ లాంటి సచివాలయం ఎదురుగా ట్యాంక్‌బండ్‌ పైన ఏర్పాటు చేస్తున్నాం. సర్దార్ పాపన్న గౌడ్ నిర్మించిన ఖిలాషాపూర్ కోటను చారిత్రక క్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నాం.

బీసీలకు 42% రిజర్వేషన్

వందేళ్లుగా ఎదురుచూస్తున్న బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం, ఏ రాష్ట్రంలో జరగని కుల గణనను తెలంగాణలో పూర్తి చేసి బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించాం. నూటికి నూరు శాతం చిత్తశుద్ధితో పకడ్బందీగా జనాభాను లెక్కించి సమగ్ర సమాచారం సేకరించాం.

తొండి వాదనలతో ప్రభుత్వం తీసిన లెక్కలను వక్రీకరిస్తే మళ్లీ రాబోవు వందేళ్ల వరకు బహుజనులకు న్యాయం జరగదు. క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని అత్యంత పకడ్బందీగా సమాచారాన్ని సేకరించి క్రోడీకరించాం.

ఆ వివరాల ఆధారంగానే బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం, విద్య ఉద్యోగావకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రిమండలి తీర్మానించి శాసనసభలో సమగ్ర చర్చ చేసి ఆమోదించిన రెండు బిల్లులను గవర్నర్ గారికి పంపించాం. అలాగే స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీలులేకుండా గత ప్రభుత్వం చేసిన పంచాయతీ రాజ్ చట్టం అడ్డంకిగా మారడంతో ఆ గరిష్ట పరిమితిని తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశాం.

ఆ మూడింటినీ గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపించారు. వాటిని ఆమోదించాల్సిన అవసరం ఉంది. గడిచిన అయిదు నెలలుగా పెండింగ్‌లో పెట్టారు. వాటిని ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి చేయడానికి యావత్ మంత్రిమండలి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాల ప్రతినిధులందరం ఢిల్లీలో ఆందోళన చేశాం.

కుల గణన లెక్కల్లో ఎక్కడా ఒక్క తప్పు లేదు. ప్రతి 150 ఇండ్లకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున 95 వేల మంది ఎన్యుమరేటర్లు 60 రోజుల పాటు ఇంటింటికీ తిరిగి సమాచారాన్ని సేకరించారు. ఆ సమాచారాన్ని సంపూర్ణంగా కంప్యూటర్ లో క్రోడీకరించాం.

దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు చట్టంలోనే తావు లేదు. తెలంగాణ పంపించిన రెండు బిల్లులు, ఆర్డినన్స్‌లో అందుకు సంబంధించి ఒక ముక్కలేదు. వెనుకబాటు తనం ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాం.

సమస్యలన్నీ ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకు పోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో బహుజనులు చదువుకోవడం ద్వారానే తలరాత మార్చుకోగలరు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలంటే అందరూ చదువుకోవాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరిగి ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుంది..” అని ముఖ్యమంత్రి గారు ఉద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, సలహాదారులు కే. కేశవరావు గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నగర మేయర్ గారు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →