99 days action plan praja palana pragathi pranalika - bikki news

Praja Palana Pragathi Pranalika – ప్రజాసమస్యలపై 99 రోజుల యాక్షన్ ప్లాన్

BIKKI NEWS (MAR. 01) : 90 days action plan Praja palana Pragathi Pranalika. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు రాష్ట్రంలో ఈ ప్రణాళికను అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

90 days action plan Praja palana Pragathi Pranalika

జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ 4 కోట్ల ప్రజల పండుగ సంబురంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకను పురస్కరించుకొని 99 రోజుల పాటు జరిగే ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారు, డీపీజీ బి. శివధర్ రెడ్డి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

దేశ అభివృద్ధి పథంలోనూ, పరిపాలనలోనూ తెలంగాణను తిరుగులేని ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని శాఖల వారిగా అధికారులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు దిశానిర్ధేశం చేశారు.

గ్రామ స్థాయి నుంచి మండలస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు షెడ్యూలు ప్రకారం కార్యక్రమాలను విజయవంతం చేయాలి. అందుకు అవసరమైన ప్రణాళికను వెంటనే సిద్ధం చేసి ఆచరణలో చూపెట్టాలి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక లోగో తయారు చేయడమే కాకుండా రాష్ట్రమంతా 99 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల షెడ్యూలును సీఎస్ గారు రూపొందించాలి.

ఈ 99 రోజుల్లో ఫైళ్ల క్లియరెన్స్ తో పాటు అన్ని విభాగాలు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని ఆఫీసుల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించాలి. ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకుండా పక్కాగా అమలు చేయాలి. 99 రోజుల కార్యక్రమ పురోగతిని వ్యక్తిగతంగా పరిశీలిస్తా. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తా.

పరిపాలనలో అధునాతన సాంకేతిక నైపుణ్యాన్ని సమర్థంగా వినియోగించాలి. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పౌరులకు అవసరమైన సేవలన్నింటినీ మరింత సులభతరం చేయాలి. ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా అన్ని సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలి.

కరెంట్ మీటర్, తమ ఇంటి అనుమతి, నల్లా కనెక్షన్ మొదలు ప్రభుత్వం నుంచి పొందాల్సిన అనుమతులకు, సేవలకు ప్రజలు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా జరగాలి. వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ జరిగే విధానం అమల్లోకి వచ్చినట్టుగా, ప్రతి విభాగంలోనూ సంస్కరణలు తీసుకురావాలి.

ఏ ఫైలు, ఏ ఆర్జీ ఎక్కడ ఉందో దరఖాస్తుదారు తెలుసుకునే సునాయస విధానం అమలులోకి రావాలి. సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ గారి అధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేయాలి. మూడు వారాల్లో కమిటీ నివేదికను అందించాలి.

ప్రతి విభాగం ఈ-ఆఫీస్ విధానం, డిజిటల్ గవర్నెన్స్ ను అమలు చేయాలి. అన్ని శాఖలకు సంబంధించిన డేటా నిల్వ చేస్తున్న పాత కాలం సర్వర్లను రాబోయే 20 సంవత్సరాలకు సరిపడేలా అప్‌డేట్ చేయాలి.

సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయడానికి సాంకేతికతను వినియోగించాలి. మహాలక్ష్మి, రేషన్ కార్డులు, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ అర్హులైన వారందరికీ చేరాలి. సొంత స్థలముండి ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి అందాలి. రేషన్ కార్డులు అప్లై చేసుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగాలి.

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించేలా రాష్ట్రంలో వంద మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేయటంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలను మెరుగుపరిచే విధానాలు అమలు చేయాలి.

తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా ప్రభుత్వం రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ మూడు జోన్లుగా విభజించి దేశంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కోర్ అర్బన్ రీజియన్ లో చేపట్టాల్సిన సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలి. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీకి దాదాపు 10 వేల చ.కి.మీ. మ్యానుఫాక్చరింగ్ జోన్ భవిష్యత్తులోనూ కీలకంగా మారుతుంది.

అన్ని విభాగాల్లో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల డేటా కార్యదర్శుల వద్ద సిద్ధంగా ఉండాలి.

రాష్ట్రంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీలు లేదు. ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలి. బడ్జెట్ ప్రతిపాదనల్లో వీటిని చేర్చాలి.

హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో పాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరం, విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి దాదాపు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఎంఓయూలన్నీ ఫలవంతమయ్యేలా కార్యదర్శులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి అవి గ్రౌండయ్యేంత వరకు సంప్రదింపులు జరపాలి.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలకు కోరుకున్న మార్పును అందిస్తామనే హామీతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజుతో ప్రభుత్వం రెండేళ్లు మూడు నెలలు పూర్తి చేసుకుంది. ప్రజలు కోరుకున్న మార్పును స్వాగతిస్తున్నారు.

ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు పునరంకిత భావంతో ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. ఇప్పటివరకు సాధించిన విజయాలను నిజాయితీగా అంచనా వేసుకుని, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో అధికారులు గుర్తించాలి.

వచ్చే ఎన్నికల నాటికి మిగిలిన రెండేళ్లు తొమ్మిది నెలలకు సరైన దిశా నిర్దేశంతో కార్యాచరణ రూపొందించుకోవాలి. ప్రజలు చూపిన విశ్వాసాన్ని మాటలతో కాకుండా సుపరిపాలనతో గౌరవించాల్సిన బాధ్యత తనతో పాటు అధికారులు అందరిపైనా ఉంది.. అని ముఖ్యమంత్రి గారు నిర్దేశం చేశారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →