BIKKI NEWS (Nov. 26): Telangana Treasury Funds Freezing Pending Bills 2026. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ట్రెజరీ కార్యాలయాల్లో ‘నిధుల ఫ్రీజింగ్’ (Freezing) పేరిట బిల్లుల చెల్లింపులపై కొనసాగుతున్న అనధికారిక ఆంక్షలు తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఎప్పటికప్పుడు విధిస్తున్న ఆంక్షల కారణంగా ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు & ఔట్సోర్సింగ్ సిబ్బంది, సర్పంచులు మరియు కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన జీతాలు, పెన్షన్లు, బిల్లుల డబ్బుల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
Telangana Treasury Funds Freezing Pending Bills 2026
ట్రెజరీ ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్న ప్రధాన విభాగాలు ఇవే!
ఉద్యోగుల బిల్లులపై నెలంతా ఫ్రీజింగ్: రెగ్యులర్ ఉద్యోగుల నెలవారీ జీతాలు మినహా మిగిలిన దాదాపు అన్ని రకాల చెల్లింపులకు ట్రెజరీల్లో ఫ్రీజింగ్ బూచి చూపుతున్నారు. జీపీఎఫ్ (GPF), ఫెస్టివల్ అడ్వాన్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి ఉద్యోగుల వ్యక్తిగత బిల్లులపై నెలంతా ఫ్రీజింగ్ కొనసాగుతోంది.
ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి అందని వేతనాలు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 5.5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా 1 నుండి 5వ తేదీలోపు వేతనాలు చెల్లించకపోతే సంబంధిత అధికారుల జీతాలు ఆపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. ఉదాహరణకు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని ఔట్సోర్సింగ్, దినసరి వేతనంపై పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు (DEO), మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు 25వ తేదీ దాటినా వేతనాలు అందక కుటుంబం గడవని పరిస్థితులు నెలకొన్నాయి.
పంచాయతీలు & మున్సిపాలిటీల అభివృద్ధి నిధులకు బ్రేక్: నెలలో దాదాపు 20 రోజులకు పైగా ఈ అనధికారిక ఫ్రీజింగ్ కొనసాగుతుండటంతో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా ఎస్ఎఫ్సీ (SFC), జనరల్ ఫండ్, వివిధ ఆర్థిక సంఘాల అభివృద్ధి నిధుల వ్యయంపై ట్రెజరీ ఆంక్షల ప్రభావం పడుతోంది.
సర్వర్ డౌన్ పేరిట దాటవేత వైఖరి: బిల్లుల చెల్లింపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఏమీ లేకపోయినా, పలు సందర్భాల్లో ‘సర్వర్ డౌన్’ వంటి సాంకేతిక లోపాల పేరిట బిల్లులను నిలిపివేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్ క్లియరెన్స్ కోసం సర్పంచులు, కాంట్రాక్టర్లు జిల్లా ట్రెజరీ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాస్తుండగా, ట్రెజరీ సిబ్బంది సర్వర్ డౌన్ సమాధానంతో దాటవేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

