BIKKI NEWS (Nov. 24) : Telangana Inter Board Merger Six Phases Roadmap. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా వేర్వేరుగా కొనసాగుతున్న పాఠశాల విద్య (School Education), ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు పక్కా రోడ్‌మ్యాప్ సిద్ధమవుతోంది. ఇంటర్ బోర్డును స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఆరు దశల్లో విలీనం చేసి, 2030 నాటికి కేజీ నుంచి 12వ తరగతి వరకు (K-12) వంద శాతం ఏకీకృత విద్యా విధానాన్ని అమలు చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి మిన్నీ మాథ్యూ నేతృత్వంలోని కోర్ గ్రూప్-5 కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
Telangana Inter Board Merger Six Phases Roadmap
విలీన ప్రక్రియకు ఇప్పుడు ఈ నివేదికే అత్యంత కీలకంగా మారింది. న్యాయపరమైన చిక్కులు రాకుండా చట్టాల్లో సమూల మార్పులు చేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది.
Telangana Inter Board Merger Six Phases Roadmap – ఇంటర్ బోర్డు విలీనంలోని ఆరు దశలు ఇవే
- చట్టాల సవరణ & రద్దు: 55 ఏళ్ల నాటి ఇంటర్మీడియట్ విద్యా చట్టం–1971ను ఆర్డినెన్స్ లేదా అసెంబ్లీ బిల్లు ద్వారా రద్దు చేసి, 11, 12 తరగతులను స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తెచ్చేలా తెలంగాణ విద్యా చట్టం–1982కు సవరణలు చేయడం.
- కొత్త బోర్డు ఏర్పాటు: టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం స్వయం ప్రతిపత్తి గల ‘సీనియర్ సెకండరీ బోర్డు’ (SSB) ఏర్పాటు చేయడం.
- బడ్జెట్ & డీడీవో కోడ్ల మార్పు: ఆర్థిక శాఖ పోర్టల్ (IFMIS) లో బడ్జెట్, డీడీవో (DDO) కోడ్లను సీనియర్ సెకండరీ విభాగానికి మార్చడం.
- డీఈవో పరిధిలోకి డీఐఈవో బాధ్యతలు: జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) బాధ్యతలను జిల్లా విద్యాశాఖాధికారి (DEO) పరిధిలోకి తీసుకురావడం.
- సర్కారు కాలేజీల విలీనం: రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలను రెండు విడతల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేయడం.
- ప్రైవేట్ కాలేజీల మార్పు: ప్రైవేట్ జూనియర్ కాలేజీలను మూడేళ్లలో దశలవారీగా సీనియర్ సెకండరీ (K-12) విధానంలోకి మార్చడం.
టెన్త్, ఇంటర్ పరీక్షలకు కొత్తగా ‘సీనియర్ సెకండరీ బోర్డు’
విలీనం తర్వాత 10, 11, 12 తరగతుల పరీక్షల కోసం స్వయం ప్రతిపత్తి గల సీనియర్ సెకండరీ బోర్డు (SSB) ఏర్పాటవుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి రిపోర్ట్ చేసే క్యాడర్ పోస్టు అధికారి ఈ బోర్డు సెక్రటరీగా ఉంటారు:
- ఎగ్జామ్ వింగ్-1: పదో తరగతి (10th Class) పరీక్షలు, మూల్యాంకనం, సర్టిఫికెట్ల జారీని పర్యవేక్షిస్తుంది.
- ఎగ్జామ్ వింగ్-2: 11, 12 తరగతుల పరీక్షల నిర్వహణను చూస్తుంది.
- స్టాట్యుటరీ అండ్ అకడమిక్ వింగ్: కాలేజీల అఫిలియేషన్లు, ఈక్వివలెన్స్, గవర్నింగ్ బాడీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.
Telangana Inter Board Merger Six Phases Roadmap – 430 సర్కారు జూనియర్ కాలేజీల విలీనం ఎలా జరుగుతుందంటే?
రాష్ట్రంలో మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు (KGBVs), గురుకులాలు కలిపి దాదాపు 1,140 సంస్థల్లో ఇప్పటికే ఇంటర్ వరకు చదువు కొనసాగుతోంది. మిగిలిన 430 సర్కారు జూనియర్ కాలేజీలను దశలవారీగా కాంపోజిట్ తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా (TGPS) మార్చాలని ప్రతిపాదించారు:
- ఫేజ్-1 (2027-28) & ఫేజ్-2 (2028-30): 2027-28లో జడ్పీ హైస్కూళ్లతో ఒకే ప్రాంగణంలో ఉన్న కాలేజీలను కలిపేస్తారు. 2028-30 మధ్య మిగతా వాటిని అనుసంధానం చేస్తారు.
- ట్విన్ క్యాంపస్ (Twin Campus): కిలోమీటర్ లోపు దూరంలో ఉన్న 260 కాలేజీలను సమీప హైస్కూళ్లతో కలిపి ఒకే సీనియర్ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ‘ట్విన్ క్యాంపస్’గా నిర్వహిస్తారు.
- క్లస్టర్ (హబ్-స్పోక్) మోడల్: ఒకటి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని 55 కాలేజీలను క్లస్టర్ మోడల్‌లో నడుపుతారు.
- టీజీపీఎస్‌లుగా అప్‌గ్రేడ్: ఐదు కిలోమీటర్లకు మించి దూరంలో ఉండి మంచి భవనాలున్న 19 కాలేజీలను దగ్గర్లోని హైస్కూళ్లతో అనుసంధానించి క్రమంగా టీజీపీఎస్‌లుగా (TGPS) అప్‌గ్రేడ్ చేస్తారు.
- ప్రైవేట్ కాలేజీలకు ఫాస్ట్-ట్రాక్ అఫిలియేషన్: ఇప్పటికే ఒకే క్యాంపస్‌లో 6 నుంచి 10వ తరగతి నడుపుతూ 12వ తరగతి వరకు విస్తరించేందుకు ఆసక్తి చూపే దాదాపు 450 ప్రైవేట్ కాలేజీలకు మొదటి ఏడాదిలోనే ఫాస్ట్-ట్రాక్ కాంపోజిట్ అఫిలియేషన్ ఇస్తారు.
ఇవి కూడా చూడండి :
• 11వ తరగతి బోర్డు పరీక్షలు ఉంటాయా.?
కమిషనర్ చేతికే అన్ని అధికారాలు!
ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (DSE), డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (DIE) అధికారాలన్నీ ‘కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్’ కు బదిలీ అవుతాయి. విద్యాశాఖ కార్యదర్శి పాలన, క్యాడర్ నియంత్రణ అధిపతిగా ఉంటారు. కమిషనర్ పరిధిలో లోకల్ బాడీ స్కూళ్లు, సీనియర్ సెకండరీ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలు, లైబ్రరీలు, ఎస్సీఈఆర్టీ (SCERT), టాస్ (TOSS), వయోజన విద్య వంటి ఆరు ప్రధాన వింగ్స్ పనిచేస్తాయి. కమిటీ ప్రతిపాదనల్లో ఎన్ని అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందనేది త్వరలో విడుదలయ్యే ముసాయిదా మార్గదర్శకాలతో తేలనుంది.

