- విద్యారంగ నిపుణులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులతో సమగ్ర చర్చలు జరపాలి..
- మౌలిక వసతులు, అధ్యాపకుల నియామకాలు, ఉద్యోగుల హక్కులకు భరోసా కల్పించిన తర్వాతే 10+2 విధానాన్ని అమలు చేయాలి…
BIKKI NEWS (Nov. 21) : SFI on Intermediate merging. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి, ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సమగ్ర చర్చలు నిర్వహించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ క్రాస్ రోడ్డు వద్ద సీఐటీయూ సిటీ కార్యాలయం వద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.
SFI on Intermediate merging
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు, విద్యార్థి సంఘాలతో చర్చించకుండా ఇంటర్ బోర్డ్ రద్దు ను ముఖ్యమంత్రి ఏకపక్షంగా ప్రకటించడం ప్రజాస్వామ్యబద్ధమైన విధానం కాదని అన్నారు.
దశాబ్దాల చరిత్ర కలిగిన ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టే ముందు ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయాలని, విద్యారంగంలో ఉన్న వాస్తవ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కేవలం ఇంటర్మీడియట్ బోర్డు రద్దు, విలీనం ద్వారా విద్యార్థుల డ్రాపౌట్లు తగ్గుతాయనే ప్రభుత్వ వాదనకు ఆధారమైన గణాంకాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
ఇంటర్మీడియట్ విద్యలో పెరుగుతున్న కార్పొరేట్ ఆధిపత్యం, అధిక ఫీజులు, విద్యార్థులపై ఆర్థిక భారం వంటి సమస్యలను పరిష్కరించకుండా విలీన నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వ విద్యారంగానికి ప్రయోజనం ఉండదని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేయడం, మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించడం, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు కఠినమైన చట్టాలు అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో 11, 12 తరగతులను ప్రారంభించేందుకు అవసరమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ వంటి అన్ని గ్రూపులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అర్హత, నైపుణ్యం కలిగిన అధ్యాపకులను నియమించి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి.
SFI on Intermediate merging – సిబ్బందికి భరోసా ఇవ్వాలి
ఇంటర్మీడియట్ విద్య విలీనం నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ భద్రత, క్యాడర్, సీనియారిటీ, పదోన్నతులు, బదిలీలు, జీతభత్యాలు, పదవీ విరమణ ప్రయోజనాలపై స్పష్టమైన సర్వీస్ నిబంధనలు ప్రకటించాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వడంతో పాటు ఏ ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలను మూసివేయకూడదని అన్నారు.
SFI on Intermediate merging – కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ప్రయోజనం కోసం సంస్కరణలు కూడదు
ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసిన ఆంధ్రప్రదేశ్ అనుభవాలను తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయాలని సూచించారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డ్రాపౌట్లకు సంబంధించిన వాస్తవ గణాంకాలను విడుదల చేసి, వాటి కారణాలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.
విద్యార్థుల ప్రయోజనాల కోసం చేపట్టే సంస్కరణలు స్వాగతించదగినవే అయినప్పటికీ, సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలహీనపడకూడదని, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రయోజనం చేకూర్చే పరిస్థితులు ఏర్పడకూడదని స్పష్టం చేశారు. ముందుగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసి, అవసరమైన మౌలిక వసతులు, అధ్యాపకులు, ఉద్యోగుల హక్కులకు భరోసా కల్పించి, సమగ్ర చర్చలు మరియు శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా మాత్రమే 10+2 విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి SFI రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రజినీకాంత్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా SFI రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు, STFI జాతీయ ప్రధాన కార్యదర్శి చావా రవి, AISF రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, PDSU రాష్ట్ర కార్యదర్శి అనిల్, PDSU రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, DYFI రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోటా రమేష్, అనగంటి వెంకటేష్, SFI రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. మమత, CJP రాష్ట్ర కో-ఆర్డినేటర్ సాయి, సునీల్ తదితరులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. కిరణ్, కె. అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్, రమేష్, నాయకులు ఆంజనేయులు, శ్రీరామ్ నాయక్, భారత్, CJP నాయకులు సునీల్, నివాస్ తదితరులు పాల్గొన్నారు.

