BIKKI NEWS (MAR. 22) : Rythu Bharosa first phase amount released. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి సాయం “రైతు భరోసా” నిధులను విడుదల చేశారు. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో మీట నొక్కి నిధులను విడుదల చేశారు. రేపటి నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమవుతాయని, వచ్చే 45 రోజుల్లోగా 9 వేల కోట్ల రూపాయలు రైతులందరి ఖాతాల్లో నిధులు చేరిపోతాయని చెప్పారు.
Rythu Bharosa first phase amount released
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో కేవలం 17 నెలల కాలంలో పూర్తి చేసిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించి రైతులకు అంకితమిచ్చారు. తర్వాత జిల్లాలో రూ. 775 కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతో మరికొన్ని కొత్త పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రజాపాలన – రైతు ఉత్సవాల్లో భాగంగా సాగిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, దామోదర రాజనర్సింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారితో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రైతును రాజును చేయడానికి వ్యవసాయ రంగంలో పంటల మార్పిడి విధానం రావాలని అభిప్రాయపడ్డారు. పశ్చిమాషియా యుద్ధం వల్ల గ్యాస్, యూరియాలకు కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
“వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడం కోసం పంటల మార్పిడిపై రైతుల్లో చైతన్యం తీసుకురావలసిన అవసరం ఉంది. అందుకు సంబంధించి సరైన ప్రణాళికలు తయారు చేయాలి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో పాటు లాభసాటిగా ఎలా మార్చాలన్న విషయాలపై ప్రణాళికలు సిద్ధం కావాలి.
పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం వల్ల రాబోయే రోజుల్లో యూరియా, గ్యాస్ సమస్యలు తలెత్తవచ్చు. ఎదుర్కొనడానికి సిద్ధపడాలి. తెలంగాణలోని రామగుండంలో ఉత్పత్తి చేస్తున్న యూరియా మన రాష్ట్రానికే ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలి.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారి నేతృత్వంలో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారి సహకారంతో రాష్ట్రానికి అత్యధికంగా యూరియా కేటాయించేలా కోరాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నానో యూరియా కూడా వినియోగం పెంచుకోవాలి.
రాష్ట్రంలో ప్రాంతాల వారిగా వేర్వేరు పంటలు పండుతున్నాయి. సారవంతమైన భూములున్నాయి. వ్యవసాయ సాంకేతిక నైపుణ్యం అందుబాటులోకి తేవాలి. గిట్టుబాటు ధరలు కల్పించాలి. పంటలను అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతులకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అందుకు బాధ్యత తీసుకుంటా. అద్భుతమైన తెలంగాణ నిర్మించుకోవడంలో, ప్రతి పంటా, ప్రతి గింజా బంగారు తెలంగాణ చేసుకోవడానికి ఉపయోగపడాలి.
రాష్ట్రంలో ప్రాంతాల వారిగా రకరకాల పంటలు పండుతున్నాయి. పంట మార్పిడి విధానాలు రావాలి. రైతులను ప్రోత్సహించాలి. పండించిన పంటలకు మరింత లాభం రావాలంటే వ్యవసాయంలో మార్పు రావాలి. రైతుల్లో చైతన్యం తీసుకురావాలి.
ఈ ఏడాది 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. సన్నబియ్యం పంపిణీ చేయడంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి చేసినప్పటికీ ఇంకా మిగిలిపోతున్నాయి. చిన్న రాష్ట్రమైనప్పటికీ ఈ ఏడాది 2.58 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచాం.
ఆయిల్ పామ్ సాగుకు మహర్దశ
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించుకున్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్ పామ్ 10 లక్షల ఎకరాల్లో పండించినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఆయిల్ పామ్ లాంటి కర్మాగారాలు వచ్చి వ్యవసాయం లాభసాటిగా మారితే రైతుల పిల్లలు చదువుకోవడానికి, ఇళ్లు కట్టుకోవడానికో ఎవరినీ చేయి చాచాల్సిన అవసరం రాదు.
నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామాన్ని రాష్ట్రంలోని 12,728 గ్రామ పంచాయతీలు ఆదర్శంగా తీసుకోవాలి. లాభసాటి పంటలు పండించే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
నర్మెట్టలో నిర్మించినట్టుగానే కొడంగల్ నియోజక వర్గంలోనూ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి జిల్లా ఇంచార్జీ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు, ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవ తీసుకోవాలి.
గత ప్రభుత్వ హయాం 114 నెలల కాలంలో రైతు సంక్షేమం కోసం సగటున ప్రతి నెల 2,533 కోట్లు ఖర్చు చేస్తే, ప్రజా ప్రభుత్వం గడిచిన 28 నెలల కాలంలో ప్రతి నెల 5,500 కోట్లు ఖర్చు చేసింది. రైతుల కోసం ఉచిత కరెంట్, గిట్టుబాటు ధరలు, సన్నవడ్లకు బోనస్, రుణమాఫీ, రైతుభరోసా, బీమా, అకాల వర్షాలొచ్చినప్పుడు పంట నష్టపరిహారం… మొత్తంగా రూ. 1.30 లక్షల కోట్లను ఖర్చు చేసి రైతు రాజ్యంగా కొనసాగిస్తున్నాం.
అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ పార్టీల మధ్య సమన్వయం ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాలను కలిసికట్టుగా సాధించుకుందాం. ప్రజా ప్రభుత్వం ఏ నియోజకవర్గాల పట్ల వివక్ష చూపదు” అని స్పష్టం చేశారు. నర్మెట్టలో జరిగిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1600 రైతు వేదికల ద్వారా రైతులు వీక్షించారు.

