El nino effects Telangana – 8 నెలల్లో తీవ్ర విద్యుత్, నీటి సంక్షోభం రానుంది – సీఎం

El nino effects telangana badly says cm revanth reddy

BIKKI NEWS : El nino effects Telangana badly says CM Revanth Reddy. ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తక్షణ చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

El nino effects Telangana badly says CM Revanth Reddy

ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉండటంతో చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.

ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యల విషయంలో సరైన యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే సంక్షోభాన్ని ముందుగా గుర్తించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

రాబోయే 8 నెలలు ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కీలకమని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు. ఈ 8 నెలల పాటు ప్రతి కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.

రాబోయే రోజుల్లో విద్యుత్ సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందని, అయితే మార్కెట్‌లో విద్యుత్ అందుబాటులో లేదని తెలిపారు. అందుకే అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. విద్యుత్ ఆధారిత పనులను సాధ్యమైనంత మేరకు తాత్కాలికంగా వాయిదా వేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ఎల్‌నినో ప్రభావంపై గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సినిమా, మీడియా, కళాజాతాలతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

రైతులు వేసిన పంటల పరిస్థితులను అంచనా వేసి, పంట చేతికొచ్చే వరకు నీటి కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. భవిష్యత్తులో నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, చుక్క నీరు కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై మంత్రులతో త్వరలో ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నట్లు ముఖ్యమంత్రి గారు తెలిపారు. వర్షపాతం తగ్గిన ప్రాంతాల్లో పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో దాదాపు 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, కరువు మండలాల ప్రకటనతో పాటు తగినంత ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేసిందని, రూ. 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరిందని గుర్తుచేశారు.

VB-G RAM G పథకంలో భాగంగా 125 రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజుల ఉపాధి కల్పించాలని కేంద్రాన్ని కోరాలని అధికారులకు సూచించారు. అదనపు పని దినాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

అవసరమైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అంశాన్ని మంత్రుల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దసరా తర్వాత గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు.

ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించేందుకు వార్‌రూమ్‌ను ఏర్పాటు చేయాలని, టోల్‌-ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాను సీఎంఓ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, డీజీపీ సీవీ ఆనంద్ గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →