BIKKI NEWS (Nov. 16) : Pocso case on principal విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన ఓ కళాశాల ప్రిన్సిపల్ కీచకుడిగా మారాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బొబ్బిలి రాజేందర్‌ను సస్పెండ్ చేస్తూ పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించారన్న తీవ్రమైన అభియోగాల నేపథ్యంలో వర్సిటీ ఈ కఠిన చర్య తీసుకుంది.
Pocso case on principal
అసలేం జరిగింది? కళాశాల ప్రిన్సిపల్ రాజేందర్ తమ పిల్లలను వేధిస్తున్నారని, పనివేళలు ముగిసిన తర్వాత కూడా వసతి గృహంలోకి (హాస్టల్) ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ నెల 5న వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లకు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన వర్సిటీ వీసీ జ్ఞానప్రకాశ్, విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన విచారణ కమిటీని నియమించారు.
విచారణ కమిటీ నివేదిక ఆధారంగా సస్పెన్షన్ విచారణ కమిటీ సిద్దిపేట వెటర్నరీ కళాశాలను సందర్శించి సమగ్ర విచారణ జరిపింది. కమిటీ సమర్పించిన నివేదిక ద్వారా ప్రిన్సిపల్ రాజేందర్ ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యాయి. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థినుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండటంతో, వారి భద్రత దృష్ట్యా రాజేందర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ శరత్చంద్ర తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రిన్సిపల్ వ్యవహార శైలిపై మరింత సమగ్ర విచారణకు ఆదేశించారు. రాజేందర్ స్థానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్. పరశురాములుకు ప్రిన్సిపల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
చిన్నకోడూరు ఠాణాలో పోక్సో కేసు నమోదు ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై బాధిత విద్యార్థిని తండ్రి ఆదివారం చిన్నకోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్ బొబ్బిలి రాజేందర్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రమోహన్ వెల్లడించారు.

