BIKKI NEWS (June 29) : 2 thousand crores for TG Employees pending bills. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ ల పెండింగ్ బిల్లులు చెల్లించడం కొరకు వరుసగా రెండో నెల కూడా 2,000 కోట్ల రూపాయలను విడుదల చేశారు.
2 thousand crores for TG Employees pending bills
ఉద్యోగుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల ఆదేశాల మేరకు ఈ నిధులు విడుదల చేశారు.
ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను 100 రోజుల్లో రూ. 6,000 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, గత నెల 29న మొదటి విడతగా రూ. 2వేల కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం, ఈరోజు రెండో విడతలో మరో రూ. 2 వేల కోట్ల నిధులను విడుదల చేసి తన నిబద్ధతను నిరూపించుకుంది.
పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిలను వంద శాతం చెల్లించి, వారి ఖాతాలను పూర్తిగా క్లియర్ చేసింది. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగుల GPF ఖాతాల్లో ఎలాంటి పెండింగ్‌లు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబర్ 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది.
పెండింగ్‌లో ఉన్న రూ. 10,000 లోపు విలువ కలిగిన చిన్న మొత్తాల బిల్లులన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించింది. ఈ విభాగంలో దాదాపు 5 లక్షలకు పైగా ఉన్న టోకెన్లను గుర్తించి, ఏమాత్రం జాప్యం లేకుండా చెల్లింపులు జరిపారు.
ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చూపుతున్న సానుకూల ధోరణి అభినందనీయమని వారు కొనియాడుతున్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన బకాయిలను కూడా క్రమపద్ధతిలో క్లియర్ చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించడంతో, ఉద్యోగుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.

