BIKKI NEWS (AUG. 29) : High court ordered for regularization of contract employees. అంగన్వాడీలను కాంట్రాక్ట్ పద్ధతిలో ఏళ్ల తరబడి పనిచేయించి, వారి సేవలను క్రమబద్ధీకరించకుండా ఇప్పుడు కొత్త నియామకాలలో పాల్గొనాలని చెప్పడం సరికాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల సేవలను క్రమబద్ధీకరించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.
High court ordered for regularization of contract employees
2013లో మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన మీరాభాయ్ తదితరులు సహా దాదాపు 200 మంది అంగన్వాడీలు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన కొత్త నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ వారు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న తమ సేవలను రెగ్యులర్ చేయాలని కోరారు. అప్పట్లో కోర్టు స్టే ఇచ్చిన కారణంగా వారు ఇప్పటివరకు కాంట్రాక్ట్ విధానంలోనే కొనసాగుతున్నారు.
ఈ పిటిషన్లపై జస్టిస్ నగేశ్ భీమపాక తాజాగా విచారణ జరిపి తీర్పు ఇచ్చారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సూపర్వైజర్ గ్రేడ్–2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కేవలం 15 శాతం వెయిటేజీ ఇవ్వడాన్ని ధర్మాసనం తప్పు బట్టింది. గతంలో వారిని రెగ్యులర్ పోస్టులకే ఎంపిక చేసినప్పటికీ, నియామకాలపై నిషేధం కారణంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయాల్సి వచ్చిందని గుర్తు చేసింది.
దశాబ్దాలుగా, కొంతమంది 25 సంవత్సరాలపాటు కూడా సేవలందించిన అంగన్వాడీ ఉద్యోగులను విస్మరించి కొత్త నియామకాలు చేపట్టడం సరైన విధానం కాదని కోర్టు పేర్కొంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారు అనర్హులని అధికారులు ఎక్కడా చెప్పలేదని, కాబట్టి వారికి పరీక్షలు రాయాలని బలవంతపెట్టడం చట్టవిరుద్ధమని తీర్పులో పేర్కొన్నారు.
సర్వీస్ ను పరిగణలోకి తీసుకోవాలి
‘జాగ్గొ వర్సెస్ కేంద్రం’, ‘కర్ణాటక వర్సెస్ ఉమాదేవి’ వంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించిన హైకోర్టు, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాక, క్రమబద్ధీకరణ అనంతరం పదవీ విరమణ ప్రయోజనాలను కల్పించే సమయంలో వారి సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కూడా ఆదేశించింది.