BIKKI NEWS ( NOV. 27) : Supreme Court on Employees Undertaking. బదిలీ నిబంధనలకు అంగీకరించి, సీనియారిటీని వదులుకుంటామని రాతపూర్వక హామీ (Undertaking) ఇచ్చిన తర్వాత, ఇప్పుడు సీనియారిటీపై అభ్యంతరం చెప్పడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) స్పష్టం చేసింది.
Supreme Court on Employees Undertaking
అంతర్రాష్ట్ర బదిలీల (Interstate Transfers) ద్వారా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల సీనియారిటీ వివాదంపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లను (SLPs) సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రాథమిక దశలోనే కొట్టివేసింది.
కేసు నేపథ్యం & సుప్రీంకోర్టు విచారణలో జరిగింది ఇదే!
ఇంజినీర్-ఇన్-చీఫ్ (అడ్మినిస్ట్రేషన్ వింగ్) ఉద్యోగుల పిటిషన్: అంతర్రాష్ట్ర బదిలీల ద్వారా తెలంగాణకు వచ్చిన ఇంజినీర్-ఇన్-చీఫ్ (అడ్మినిస్ట్రేషన్ వింగ్) పరిధిలో పనిచేస్తున్న ఎం. సునీత, బి. మధు బిందు, ఎర్ర సవిత, ఎం. భాగ్యశ్రీలు తమ సీనియారిటీని 2018 జాబితా కంటే దిగువన ఖరారు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీలు దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు రెండు రాష్ట్రాల ఇంజినీర్-ఇన్-చీఫ్‌లను ప్రతివాదులుగా చేర్చారు.
పిటిషనర్ల వాదన: ఈ పిటిషన్లపై గురువారం జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. 2017 ఆగస్టు 7న జారీ అయిన ఉమ్మడి గైడ్‌లైన్స్ ప్రకారం 2 నెలల్లోగా బదిలీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందని, అయితే ప్రభుత్వం జాప్యం చేసి 2018 జూలై 5న ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇంత జాప్యం ఉంటుందని స్పష్టత ఉంటే పిటిషనర్లు బదిలీని ఎంచుకునేవారే కాదని నివేదించారు.
ధర్మాసనం తీవ్ర అసహనం & కీలక వ్యాఖ్యలు: పిటిషనర్ల వాదనపై సుప్రీంకోర్టు బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. ఉత్తర్వుల జారీలో జాప్యం జరిగినప్పుడు బదిలీకి ఎందుకు సుముఖత వ్యక్తం చేశారని ప్రశ్నించింది. “నిబంధనల ప్రకారం చివరి ర్యాంకుకు అంగీకరిస్తూ హామీ పత్రం (Undertaking) ఇచ్చారు కదా? ఆలస్యమైందని అభ్యంతరం ఉంటే అప్పుడే తిరస్కరించాలి. విధుల్లో చేరాక ఇప్పుడు సీనియారిటీపై అభ్యంతరం చెప్పడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు” అని తేల్చిచెబుతూ ఎస్ఎల్పీలను కొట్టివేసింది.

