Today may 23rd tg cabinet decisions - కేబినెట్ సమావేశ నిర్ణయాలు - bikki news

Today May 23rd TG Cabinet decisions – కేబినెట్ సమావేశ నిర్ణయాలు

BIKKI NEWS (MAY 24) : Today May 23rd TG Cabinet decisions. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోమే 23న జరిగిన మంత్రిమండలి సమావేశం ఇందిరమ్మ ఇండ్లతో పాటు పలు కీలక అంశాలకు ఆమోదముద్ర వేసింది.

Today May 23rd TG Cabinet decisions

రాష్ట్రంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది.

జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో కూడా 1 లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని మంత్రిమండలి తీర్మానించింది. ఈ ప్రాంతంలో ఇంటి స్థలం ఉన్న వారు తక్కువగా ఉన్నందున నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రస్తుతం వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే స్థలాలను గుర్తించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో 15 వేల కుటుంబాలు పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నట్టు వివిధ సర్వేల్లో వెల్లడైన నేపథ్యంలో ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందించాలని మంత్రిమండలి తీర్మానించింది.

మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వాకిటి శ్రీహరి గారు ఈ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.

2027లో ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనుల కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించింది.

విద్యుత్ పంపిణీ, మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ RDSSలో చేరేందుకు తెలంగాణ డిస్కంలు తయారు చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌కు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం భూ సేక‌ర‌ణ‌, పున‌రావాసం, మౌలిక వ‌స‌తుల స‌దుపాయాల క‌ల్ప‌న‌కు మంత్రివర్గం 587 కోట్ల రూపాయలు కేటాయించింది.

రాష్ట్రంలోని అన్ని డీసీఎంఎస్‌లను మార్కెఫెడ్‌లో, అలాగే రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను హాకాలో విలీనం చేయాలని తీర్మానించింది.

2030 నాటికి ప్రపంచంలోని టాప్‌ 5 లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌లలో ఒకటిగా తెలంగాణను నిలబెట్టాలన్న సంకల్పంతో నెక్స్ట్‌ జనరేషన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ 2026 – 30 ను మంత్రివర్గం ఆమోదించింది. దావోస్ పర్యటన సందర్భంగా ఈ పాలసీని ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రకటించారు.

వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలతో పాటు 25 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పాలసీ రూపకల్పన జరిగింది. లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, బయోటెక్‌, మెడికల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే దిశగా పాలసీ రూపొందించారు.

యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్‌ హెల్త్‌, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో మంచి అవకాశాలు కల్పించాలని, ఇప్పటివరకు ఎక్కువగా తయారీ రంగంపై దృష్టి ఉండగా, ఇకనుంచి ఇన్నోవేషన్‌, రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ (R&D) యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించే విధంగా ఈ పాలసీలో మార్పు తీసుకురావాలని మంత్రిమండలి నిర్ణయించింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →