Netaji Subhash Chandra Bose – నేతాజీ సుభాష్ చంద్రబోస్

BIKKI NEWS (AUG. 18) : Netaji Subhash Chandra Bose death mistery. నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. విమానం ప్రమాదంలో 1945 ఆగస్టు 18న మరణించినట్లు భావిస్తున్నారు. అయితే సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీ ఇప్పటికీ మిస్టరీనే…

Netaji Subhash Chandra Bose death mistery

అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగష్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. దీని వల్ల ఆయన బతికి ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని. దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది.

షానవాజ్ కమిటీ

1956 మే నెలలో నలుగురు సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్ కు వెళ్ళింది. అప్పట్లో భారత్ కు తైవాన్ తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు.

ముఖర్జీ కమిషన్

కానీ 1999-2005 లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్థారణకు వచ్చింది. అంతే కాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్ కు లేఖను పంపడం జరిగింది.

ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదనీ, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది.

అపరిచిత సన్యాసి

1985లో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాదులో నివసించిన భగవాన్ జీ అనే సన్యాసే మారు వేషంలో ఉన్నది బోసని చాలా మంది నమ్మకం. కనీసం నాలుగు సార్లు తనని తాను బోసుగా భగవాన్ జీ చెప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన బోస్ అభిమానులు బోస్ బ్రతికే ఉన్నాడని గట్టిగ నమ్మేవారు

భగవాన్ జీ మరణానంతరం అతని వస్తువులను ముఖర్జీ కమిషన్ పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేవీ దొరకనందున భగవాన్ జీ, బోసు ఒక్కరే అనే వాదనను కొట్టివేసింది. తరువాత హిందుస్థాన్ టైమ్స్ వంటి పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో అది తప్పని తేలడంతో మళ్ళీ వివాదం మొదటికి వచ్చింది. ఏదైనప్పటికి భగవాన్ జీ జీవితం, రచనలు నేటికీ అంతుపట్టకుండా ఉన్నాయి.