కాళోజీ నారాయణరావు సమాజము పట్ల తన ఆరాటము – వ్యాసం

Kaloji jayanti special essay by Addagudi Umadevi

BIKKI NEWS (SEP. 09) : Kaloji jayanti special essay by Addagudi Umadevi. అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ, ఉద్యమాలలో ధైర్యంగా పాల్గొంటూ, అన్యాయాక్రమాలను ధిక్కరించడానికి గేయమో, పాటనో,కవితనో వ్రాసి అక్రమాలనెదిరించిన మూడక్షరాల శరము “కాళోజీ” 1914 బీజాపూర్ జిల్లా రట్టహళ్ళి గ్రామంలో సెప్టెంబర్ 9 న జన్మించిన కాళోజీ ఇంటిపేరు కాలే-జీ వాడుకలో కాళోజీగా మారింది.

Kaloji jayanti special essay by Addagudi Umadevi.

పసిప్రాయంలో”సాయారం” గ్రామంలో నివసించి మరల తెలంగాణ “కారేపల్లి గ్రామంలో నివాసమున్న కాళోజీ జీవితం 1917 నుండి వరంగల్ తోనే ముడిపడింది .
ప్లీడరు పరీక్ష పాసైన కాళోజీ ప్రజా కోర్టులోనే ప్రజల పక్షాన ప్రాక్టీసు చేసినాడు . ఆనాటి నిజాం పాలనకు’దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటం సలుపగా ఎన్నోసార్లు నిజాం ప్రభుత్వం కాళోజీని వరంగల్ నుండి బహిష్కరించినా తుపాకి గుండ్లకు వెరువక యెదురు నిలిచి పోరాడిన ధీరుడు కాళోజీ .


అన్యాయం ఎక్కడున్నా అక్కడ నేనున్నానంటు బీద ప్రజల పక్షాన నిలిచిన కాళోజీ తన సాహిత్య వస్తువుగా వారినే ఎంచుకున్నారు. వారినుద్దేశించి
“అన్నపురాసులు వొకచోట- ఆకలి మంటలు వొకచోట
కమ్మని చకిలాలొకచోట- గట్టిదవడలింకొక చోట “
అంటూ అసమానతలను తనకవిత ద్వారా వినిపిస్తూ నాటి సామాజిక వ్యత్యాసాలను సులభంగా వ్యక్తీకరించాడు.

కాళోజీ బతుకంతా రాజకీయ, సామాజిక, సాహిత్య ఉద్యమాలతోనే ముడిపడింది. తన చరిత్రలేని తెలంగాణ చరిత్ర లేదంటే అతిశయోక్తి కాదు .
ప్రజల గోడును తనగోడుగా “నాగొడవ”లో వారి ఆవేదన వ్యక్తంచేస్తూ,
“అవనిపై జరిగేటి అవకతవకలజూసి
ఎందుకో నాహృదిని ఇన్ని ఆవేదనలు”
అంటూనే
“పరుల కష్టాలతో పనియేమి మాకనెడి
అన్యుల జూచైన హాయిగా మనలేను”
అంటాడు.
అలా చూస్తూ ఊరుకునే వాళ్ళనుద్దేశించి
నేనట్లా
“దేవునిలా సాక్షీభూతున్నిగాను
సాక్షాత్తు మానవున్ని”
అని పరుల కష్టాలలో పాలుపంచుకుంటూ అక్రమాలను నిలదీసేవాడు.

రక్షించవలసినవారే భక్షకులైతే వారి పతనం తప్పదంటూ …

“బూజు పట్టిన రాజ్యభారం మోయజాలక జానపదులు రోచుచుండె
దెశమేలే రాజు రోజులు నిండినట్లే”
అంటాడు.
దేశానికి భుక్తినిడె” రైతేరాజు” అంటూ

“కర్షకుని కర్రు కదిలినన్నాళ్ళే బతుకు”
అని కర్షకులే లేకపోతే ఏ వర్గం బతకదంటాడు.
1944 జనగామ, నల్గొండలో జరిగిన అన్యాయాల గురించి నాజీల పాలనను వ్యతిరేకిస్తూ
“నవయుగంబున నాజివృత్తుల నగ్ననృత్యమింకెన్నాళ్ళు
శాంతిభద్రతలపేర దుష్టతను సమర్ధించుటింకెన్నాళ్ళు”
అని నాజీల పాలనను నిరసించాడు.
తన కవిత్వం మొత్తం సామాన్యుని జీవితంతోనే ముడిపడడమేగాక ,సామాన్యునితో మాట్లాడినట్టుగా కవితలు వ్రాయడం అతని ప్రత్యేకత. కవి ఏది రాసినా అది సామాన్యుడిని కూడ స్పృశించాలనేది తననైజం.
అందుకే
“పలుకుబడుల భాషగావాలి-బడిపలుకులభాషకాదు” అంటాడు.

ప్రభుత్వం ఏ ప్రయోజనాలందించినా అవిసామాన్యుడి దాకా చేరాలని అప్పుడే సమాజం బాగుపడుతుందంటూ
“పండించు ప్రాణాలు పస్తుపడ్డాక
పాడురాజ్యం కాపాడుకుంటేయేమి”
అని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.
కాళోజీమీద వేమన సాహిత్య ప్రభావంకూడావుంది .తన సాహిత్యంలో కూడా సామెతలను విరివిగా ఉపయోగించేవాడు
“సాగిపోవుటె బతుకు- ఆగిపోవుటె చావు
బ్రతుకు పోరాటము- విడువకారాటము”

ఇలా కాళోజీ గురించి ఎంత చెప్పినా వొడువని ముచ్చటే
కాళోజీ మూడక్షరాల గ్రంథం
ప్రజలగుండెల్లో నిలిచిన కాళోజీ “ప్రజాకవి”.

అంతటి మహోన్నతుడి త్యాగానికి గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పేరిట పురస్కారాన్ని ప్రతీయేటా యివ్వడమేగాకుండా ,వరంగల్ వైద్య విశ్వవిద్యాలయానికి అతని పేరునుంచింది,తెలంగాణా గుండెలలో అమరుడైన కాళోజీకి యావత్ తెలంగాణ ఋణపడివుంది..

అడ్డగూడి ఉమాదేవి
తెలుగు అధ్యాపకురాలు, సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రి వరంగల్ తూర్పు కళాశాల
చరవాణి- 9908057980 .