CM REVANTH REDDY – సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

BIKKI NEWS (JULY 21) : CM REVANTH REDDY CONFERENCE WITH COLLECTOR. తెలంగాణలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యావత్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా భారీ వర్షాలు, వ్యవసాయం, ఆరోగ్యం, నీటి పారుదల వ్యవహారాలు, రేషన్ కార్డుల జారీ వంటి అయిదు కీలక అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

CM REVANTH REDDY CONFERENCE WITH COLLECTOR

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించి అవసరమైన ఆదేశాలను జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు కొత్తగూడెం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనగా మిగిలిన మంత్రులు ముఖ్యమంత్రి గారితో పాటు సచివాలయం నుంచి పాల్గొన్నారు.

ప్రస్తుత సీజన్‌లో కలెక్టర్లు కచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కీలకమైన అయిదు విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు సంబంధించి రోజూ వారి కార్యాచరణపై నివేదికలు సమర్పించాలని చెప్పారు. అత్యవసర పనుల కోసం ప్రతి కలెక్టర్ గారికి కోటి రూపాయల నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని ఆదేశించారు.

రైతులు, పేద ప్రజల కంటే తమ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదు. ప్రస్తుత సీజన్‌లో ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. నష్టం జరిగితే ఎవరినీ ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. సీజన్‌లో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి.

వచ్చే రోజుల్లో వర్షాలు కురియనున్న నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కొన్ని చోట్ల అంచనాలకు మించిన భారీ వర్షం కురుస్తోంది. ఈ సీజన్‌లో వాతావరణ శాఖ అందించే సూచనలను ప్రజలకు చేరే విధంగా అప్రమత్తం చేయాలి.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

నీటి పారుదల వ్యవహారాల్లో నీటి నిల్వలను జాగ్రత్తగా అంచనా వేసుకుంటూ ముందుకు సాగాలి. జిల్లాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటల నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలి. కృష్ణా బేసిన్‌లో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల కింద నీటి విడుదల మొదలైంది. త్వరలోనే నాగార్జునసాగర్ నీటిని విడుదల చేస్తాం.

సీజన్‌లో డెంగీతో పాటు సీజనల్ జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు సర్వసన్నద్ధంగా ఉండాలి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, ఐటీడీఏ ఏజెన్సీ ఏరియాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. పీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండే విధంగా కలెక్టర్లు పర్యవేక్షించాలి.

ఎరువులు, యూరియా కొరత రాకూడదు

రాష్ట్రంలో ఎరువులకు కొరత లేదు. ఎరువులు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి డీలర్ వద్ద ఎరువులు ఎంత మేరకు అందుబాటులో ఉన్నాయన్నది స్టాక్ వివరాలను తెలియజేస్తూ షాపు ముందు విధిగా డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలి. ప్రతి షాపు వద్ద పోలీసు, రెవెన్యూ సిబ్బందిని పెట్టి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలి.

రాష్ట్రంలో 20-25 శాతం మేరకు ఎరువులను వ్యవసాయానికి కాకుండా ఇతర రంగాలకు వాడుతున్నట్టు ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి నడ్డా గారిని కలిసినప్పుడు చెప్పారు. ఈ విషయంలో అక్రమ రవాణా జరగకుండా నిఘాను అప్రమత్తం చేయాలి. దారి మళ్లించకుండా చూడాలి.

వ్యవసాయానికి ఉపయోగించాల్సిన యూరియా లాంటి ఎరువులను వ్యాపార అవసరాలకు ఎవరు మళ్లించినా క్రిమినల్ కేసులు నమోదు చేయండి. రైతులకు నష్టం చేసే పని ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు. ఎరువులకు సంబంధించిన సమస్యలేమైనా ఉంటే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ కేటాయించండి. కొందరు కృత్రిమ కొరతను సృష్టిస్తూ గందరగోళపరుస్తున్నారు.

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల కారణంగా GHMC పరిధిలో నీటి నిల్వ, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా ఆధ్వరంలోని 150 టీమ్‌లు ఎప్పటికప్పుడు రంగంలో ఉండాలి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమన్వయం చేసుకుని ముందస్తుగా బృందాలను సిద్ధం చేసుకోవాలి.

ఆగస్టు 10 వరకు రేషన్ కార్డుల పంపిణీ చేయాలి

మరో కీలకమైన అంశం రేషన్ కార్డులు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాం. 7 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు. పాత రేషన్ కార్డుల్లో పేర్లు తొలగించడం, కొత్త వారిని చేర్చడంతో సహా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

రాష్ట్రంలో మొత్తంగా 96.95 లక్షల రేషన్ కార్డులు ఉండగా, వాటి ద్వారా 3.10 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ ఉన్నప్పుడు అంత డిమాండు లేదు. సన్నబియ్యం పంపిణీ ప్రారంభించినప్పటి నుంచి రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.

రేషన్ కార్డుల జారీపై ఈ నెల 25 వ తేదీ నుంచి ఆగస్టు 10 వ తేదీ వరకు జిల్లా ఇంచార్జీ మంత్రులు, జిల్లా మంత్రులు అన్ని మండల కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేస్తూ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలి. ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక మండల కేంద్రంలోనైనా కచ్చితంగా కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలి. దాదాపు 15 రోజుల పాటు కార్యక్రమాల కోసం ఒక షెడ్యూలు తయారు చేసుకుని పర్యవేక్షించాలి.

25 నుంచి పక్షం రోజుల పాటు షెడ్యూలు వేసుకుని ప్రత్యేకంగా పాత జిల్లా కేంద్రానికి జిల్లా కలెక్టర్లందరినీ పిలిచి జిల్లా ఇంచార్జి మంత్రి సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించాలి. జిల్లా మంత్రి, ఇంచార్జి మంత్రి, కలెక్టర్లతో సమన్వయం చేసుకుని, ప్రతి మండలానికి ఒక అధికారిని ఇంచార్జిగా వేసి పర్యవేక్షించాలి. కీలకమైన అయిదు అంశాలపై ఉమ్మడి జిల్లాలో సమీక్ష నిర్వహించి సరైన మార్గనిర్దేశం చేయాలి.

ఈ వీడియో కాన్ఫరెన్ లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర రాజనర్సింహ గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, వివేక్ వెంకటస్వామి గారు, వాకిటి శ్రీహరి గారు, సీఎం సలహదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు గారితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.