Pensions – చేయూత పింఛన్ల పంపిణీ పై కీలక నిర్ణయం

BIKKI NEWS (AUG. 29) : cheyutha Pensions distribution with fingerprint. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పథకంను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ‌లు, హెచ్‌ఐవీ, డ‌యాలసిస్ భాదితులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు ఆర్థిక భరోసా ల‌భిస్తోంది. ప్రస్తుతం మొత్తం పదకొండు రకాల పింఛన్లు చేయూత పథకం కింద ప్రభుత్వం అందజేస్తుంది.

cheyutha Pensions distribution with fingerprint.

ఇప్పటి వరకు పింఛన్ దారుల ధృవీకరణ కోసం 2G ఆధారిత ఫింగర్ ప్రింట్ పరికరాలను వినియోగిస్తున్నారు. ఇప్పుడు వాటి స్థానంలో ఆధునిక సాంకేతికతతో కూడిన ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా “సరైన వ్యక్తికి – సరైన పింఛన్ – సరైన సమయంలో” అందేలా పింఛన్ పంపిణీ మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా మారనుంది.

ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.15.50 కోట్ల బడ్జెట్‌తో 5G ఆధారిత L1 ఫింగర్ ప్రింట్ పరికరాలు, కొత్త మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసింది. ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో ఈ పరికరాలను ప్రభుత్వం వినియోగించింది. ఆశించిన ఫలితాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా 6,300 బ్రాంచ్ పోస్టుమాస్టర్లకు స్మార్ట్ మొబైల్ ఫోన్లు, పరికరాలు పంపిణీ చేయనున్నారు. స్మార్ట్ మొబైల్ ఫోన్లు పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లాలోని పస్రా కేంద్రంలో ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 6300 మంది పోస్టుమాస్టర్లకు పరికరాలను అందజేయనున్నారు.

ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను TG Online ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. కొత్త సాంకేతిక పరిష్కారం వల్ల పింఛన్ దారుల ధృవీకరణ సమయం మూడు సెకన్లకు తగ్గి, పింఛన్లు వేగంగా పంపిణీ అవుతాయి. దీంతో లబ్ధిదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వెను వెంట‌నే తమ పింఛన్లు అందుకుంటారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, వృద్ధులు, వేలిముద్రలు చెరిగిన వారు వంటి వారికి ముఖ గుర్తింపు యాప్ ఎంతో మేలు చేస్తోంది.

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచే దిశగా ఈ పథకం డిజిటల్ రూపాంతరం పొందటం ద్వారా పింఛన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, వేగం పెరిగి పింఛన్ దారులకు సత్వర సేవలు అందుతాయని మంత్రి సీతక్క ప్రకటించారు. పించన్దారుల సమస్యల దృష్టిలో పెట్టుకొని ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి సీతక్క తెలిపారు.