ఇంటర్మీడియట్ కళాశాలల్లో క్రీడలు తప్పనిసరి – డైరెక్టర్ కీలక ఆదేశాలు

BIKKI NEWS (SEP. 16) : Sports compulsory in all intermediate colleges. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి కళాశాలలో క్రీడలు, మెడిటేషన్ మరియు ప్రయోగ తరగతులు తప్పనిసరిగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది.

Sports compulsory in all intermediate colleges

రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ ఒత్తిడిలేని విద్యను అందించాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య ఐ.ఏ.ఎస్, ఆధ్వర్యంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఇంటర్మీడియట్ కళాశాలల యాజమాన్యాలతో కీలక సమావేశం నిర్వహించబడింది.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్యా దశ విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన మలుపు కావడంతో, వారి శారీరక, మానసిక, భావోద్వేగ పరిపక్వత కోసం క్రీడలు, ధ్యానం మరియు ప్రయోగ తరగతులను తప్పనిసరిగా ప్రతీ కళాశాలలో నిర్వహించాలని ఆదేశించారు.

వీటిని వారానికి కనీసం ఒకసారైనా నిర్వహిస్తూ, ఈ అంశాలను టైమ్ టేబుల్లోను భాగంగా చేర్చాలని స్పష్టం చేశారు.

ఈ మార్గదర్శకాలు అమలుజరుగుతున్న తీరును పరిశీలించేందుకు కార్యదర్శి స్వయంగా కొన్ని ప్రైవేట్ మరియు కార్పొరేట్ కళాశాలలను త్వరలో సందర్శించి తనిఖీ చేయనున్నారు.

ప్రయోగశాలలను, సీసీ టీవీ పర్యవేక్షణలో ఉంచాలని మరియు ప్రయోగాత్మక బోధన మరింత ప్రభావవంతంగా జరగాలని సూచించారు.

పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో ఒత్తిడికి లోనయ్యే ధోరణి పెరిగే అవకాశం ఉన్నందున, ఒత్తిడి లేని విద్యా వాతావరణాన్ని ఏర్పరచేందుకు కళాశాలల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ చర్యల ద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం, ఆరోగ్యవంతమైన పోటీతత్వం, మానవ సంబంధాలు, భావోద్వేగ నియంత్రణ వంటి విలువలు పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన స్థాయిలో కొన్సిలింగ్ సేవలు కల్పించాలని సూచించారు.